బెల్టు నిర్వాహకులపై బైండోవర్ కేసులు
ఇచ్ఛాపురం రూరల్ : అక్రమంగా నాటుసారా, బెల్టు షాపుల నిర్వాహకులపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ ప్రొహిబిషన్ సీఐ పి.దుర్గాప్రసాద్ తెలిపారు. మంగళవారం ఇచ్ఛాపురం, కవిటి మండలాలకు చెందిన 18 మంది బెల్టుషాపు నిర్వాహకులను, పాత కేసులలోని ముద్దాయిలను తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చి తహసీల్దార్ ఎన్.వెంకటరావు సమక్షంలో బైండోవర్ నమోదు చేశారు. ఇకపై సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. బెల్టు షాపుల నిర్వహణ, నాటుసారా అమ్మకం చేస్తున్నట్లు తెలిస్తే తమకు 14405 టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందజేయలని కోరారు. ఎకై ్సజ్ ఎస్‌ఐ జీసీహెచ్‌వి రమణారావు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
కార్గో ఎయిర్‌పోర్టు వద్దు
మందస : బిడిమి గ్రామంలోని జుత్తు జగన్నాయికులు భవనంలో పలాస ఆర్‌డీవో వెంకటేష్ మంగళవారం భూ సర్వే పేరిట గ్రామస్తులతో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. బిడిమి రెవెన్యూ గ్రామంలోని పెద్ద బిడిమి, తిమ్మల బిడిమి, కొత్త బిడిమి, శ్రీరామ్‌నగర్ గ్రామాలకు చెందిన రైతులంతా పాల్గొని తమకు కార్గో ఎయిర్‌పోర్టు వద్దని ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కార్గో ఎయిర్‌పోర్టు వ్యతిరేక కమిటీ సభ్యులైన కొమర వాసు, జోగి అప్పారావు, బత్తిన లక్ష్మణ్‌లను పోలీసులు నిర్బంధించి.. బిడిమి రెవెన్యూ భూములకు సంబంధం లేని వారిని సమావేశానికి ఎలా అనుమతి ఇచ్చారని వాగ్వాదానికి దిగారు. తక్షణమే కార్గో ఎయిర్ పోర్టు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ స్పందిస్తూ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
నేడు ఏపీడబ్ల్యూజేఎఫ్
ఆవిర్భావ దినోత్సవం
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవం బుధవారం శ్రీకాకుళం నగరంలోని ఎన్‌జీవో హోమ్‌లో నిర్వహించనున్నట్టు ఎన్‌ఏజే జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు సత్తారు భాస్కరరావు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్.కృష్ణ, జి.లక్ష్మణరావు ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టుల హక్కులు, బాధ్యతలు, చట్టాలు అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ, పాత్రికేయ సంఘాలు, పాత్రికేయ మిత్రులు పాల్గొనాలని కోరారు.
9న శిష్టకరణ శతాబ్ది స్థూపావిష్కరణ
శ్రీకాకుళం కల్చరల్ : అఖిల భారత శిష్టకరణ సంఘం స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 9న జలుమూరులో శతాబ్ది స్థూపావిష్కరణ వేడుక నిర్వహిస్తున్నట్లు ఆలిండియా శిష్టకరణ సంఘం అధ్యక్షుడు డబ్బీరు వెంకట కృష్ణారావు మంగళవారం తెలిపారు. 1925లో జలుమూరు వేదికగా జాతీయ స్థాయి శిష్టకరణ సంఘం ఏర్పాటైందన్నారు. నాటి నిరక్షరాస్యత, వెనుకబడిన సమాజాన్ని చైతన్య పరచడంలో శిష్టకరణాల పాత్ర కీలకమన్నారు. అఖిల భారత శిష్టకరణం సంఘం నాయకుల తీర్మాన, ఆహ్వానం మేరకు శిష్టకరణ బంధువులంతా వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


