
పక్కాగా సహాయక చర్యలు
● వరద ప్రాంతాల ఏరియల్ వ్యూలో సీఎం మోహన్‌చరణ్ మాఝి ● 3 జిల్లాల్లో 8 మండలాలు మునక ● 81 గ్రామాల్లో 30 వేల మందిపై ప్రభావం
భువనేశ్వర్:
వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్ జిల్లాల్లో వరద పరిస్థితిపై బుధవారం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఆయనతో రాష్ట్ర రెవెన్యు, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి, ఉన్నత విద్యా శాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్, ప్రత్యేక సహాయ కమిషనర్ దేవ్ రంజన్ కుమార్ సింగ్ ఉన్నారు. ప్రభావిత జిల్లాల్లో వరద పరిస్థితిని ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ నేపథ్యంలో స్థానిక లోక్ సేవాభవన్‌లో అనుబంధ విభాగాల, శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. 3 జిల్లాల్లో 8 మండలాల 81 గ్రామాలు వరద ప్రభావానికి గురైనట్లు తెలిపారు. బాలాసోర్ జిల్లాలో 4 మండలాలు బొస్తా, బలియాపాల్, భొగరాయ్, జలేశ్వర్, భద్రక్ జిల్లాలో ఽ2 మండలాలు దామ్‌నగర్, భండారిపొఖొరి, జాజ్‌పూర్ జిల్లాలోని 2 మండలాలు జాజ్‌పూర్,దశరథ్‌పూర్ ప్రభావితమైనట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో వరదల వల్ల దాదాపు 30 వేల మంది ప్రభావితం అయ్యారని చెప్పారు. వరద ముంపుతో ప్రభావితమైన ప్రాంతాల నుంచి 5,869 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. ప్రస్తుతం వివిధ నదులలో నీటి మట్టం క్రమంగా తగ్గుతోందని, బాలాసోర్ జిల్లాలో సువర్ణ రేఖ, జలకా నదులలో నీటి మట్టం తగ్గుగుముఖం పడుతోందన్నారు. ప్రస్తుతానికి వరద పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, కెందుఝొరొ, మరికొన్ని జిల్లాల్లో వరదలు వచ్చినప్పటికీ గణనీయమైన ప్రభావాన్ని చూపలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి బాధిత ప్రజలకు అటుకులు, బెల్లం పొడి పదార్థాలు, అవసరమైతే వండిన తాజా ఆహార సరఫరా మరో 7 రోజులపాటు నిరవధికంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బాలాసోర్‌లో 16, భద్రక్‌లో 10, జాజ్‌పూర్‌లో 3 ఉచిత వంట శాలలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వీటి ఆధ్వర్యంలో 10 వేల మంది బాధిత ప్రజలకు వండిన ఆహారాన్ని అందజేస్తుమన్నారు. వరదల తదనంతర సమస్యలు నేపథ్యంలో యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అతిసార, ఇతర నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నియంత్రణ, నీటి వనరులను శుద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
సత్వర నివేదిక ఆదేశాలు..
వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని తక్షణ అంచనా వేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. కలెక్టర్ల నివేదిక ఆధారంగా బాధిత ప్రజలకు తగిన సహాయం అందజేస్తామన్నారు. కూలిన ఇల్లు, పాడి పశువుల పరిహారం, గ్రామీణ ప్రాంతాల్లో వరద కోతకు గురైన రహదారుల మరమ్మతులు, ప్రధాన మార్గానికి అనుసంధాన కార్యకలాపాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. వరద ముంపుతో ప్రాణ నష్టం జరగకుండా చేపట్టిన చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బాలసోర్ జిల్లాలో 17 ఒడ్రాఫ్, 13 అగ్నిమాపక బృందాలను, భద్రక్ జిల్లాలో 1 ఎన్‌డీఆర్‌ఎఫ్, ఒక ఒడ్రాఫ్, 13 అగ్నిమాపక బృందాలను, జాజ్‌పూర్ జిల్లాలో 1 ఒడ్రాఫ్, 14 అగ్నిమాపక బృందాలను మోహరించినట్లు ముఖ్యమంత్రి వివరించారు.

పక్కాగా సహాయక చర్యలు

పక్కాగా సహాయక చర్యలు