
భాండాగారం చిత్రాల విడుదలపై ఆగ్రహం
భువనేశ్వర్: పూరీ శ్రీమందిరం సముదాయంలో జగన్నాథుని రత్న భాండాగారం చిత్రాలను భారత పురావస్తు సర్వే సంస్థ ఏఎస్‌ఐ సాంఘిక మాధ్యమంలో విడుదల చేయడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి డాక్టర్ అరవింద కుమార్ పాఢి ఏఎస్‌ఐకి లేఖ రాశారు. రహస్యంగా ఉండాల్సిన శ్రీ మందిరం లోపలి ప్రాకారం ఫొటోలు అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ప్రసారం చేసిన వారిని గుర్తించి క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే
పర్లాకిమిడి: గజపతి జిల్లా కొత్త కలెక్టర్ మధుమితను బుధవారం మోహానా ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు దాశరథి గోమాంగో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గజపతిజిల్లాలో ఆర్.ఉదయగిరి బ్లాక్ ఆకాంక్ష సమితిగా ముఖ్యమంత్రి పురస్కారం పొందినందుకు అభినందనలు తెలియజేశారు.
చెరువు పనులపై ఎమ్మెల్యే సమీక్ష
పర్లాకిమిడి: స్థానిక కొత్త బస్టాండ్ రోడ్డు శంకర్‌బాస్ చెరువు పునరుద్ధరణ పనులపై బుధవారం పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి సమీక్షించారు. ఐదేళ్లుగా కొనసాగుతున్న శంకర్‌బాస్ చెరువు, చుట్ట పక్కల పార్క్ పనులు సుమారు రూ.70 లక్షలతో పునరుద్ధిరిస్తున్నారు. ఈ పనులను పీడబ్ల్యూడీ శాఖకు అందజేశారు. ఈ శంకర్‌బాస్ పనులను సకాలంలో పూర్తిచేయాలని రోడ్లు–భవనాల శాఖ ఇంజినీర్లను ఎమ్మెల్యే ఆదేశించారు.
సాంకేతికతను సద్వినియోగపరచుకోవాలి
ఇచ్ఛాపురం రూరల్: వరి సాగులో మూస ధోరణికి స్వస్తి పలుకుతూ రైతులు సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ ఉప సంచాలకులు టి.భవానీశంకర్ అన్నారు. బిర్లంగిలో రైతులకు డ్రోన్ వినియోగంపై బుధవారం అవగాహన కల్పించారు. ఒక ఎకరానికి మందు పిచికారీ చేసేందుకు కేవలం పది నిమిషాల సమయం పడుతుందన్నారు.

భాండాగారం చిత్రాల విడుదలపై ఆగ్రహం