
హౌస్ కీపింగ్ సిబ్బంది ఆందోళన
రాయగడ: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హాస్పిటల్ సఫాయి, హౌస్ కీపింగ్ సిబ్బంది మంగళవారం ఆందోళన చేపట్టారు. స్థానిక బారిజొల వద్దనున్న జిల్లా ముఖ్యవైద్యాధికారి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన సిబ్బంది, తమ డిమాండ్లు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. సఫాయి, హౌస్ కీపింగ్ చేస్తున్న సిబ్బందికి గుత్తేదారు సంస్థ సకాలంలో వేతనాలు చెల్లించడం లేదన్నారు. ఈపీఎఫ్, ఈఎస్‌ఐ ప్రతీ నెలలో జమచేయాలన్నారు. ఆల్ ఒడిశా హాస్పిటల్ సఫాయి కర్మచారి రాయగడ శాఖ అధ్యక్షులు నేహా సింహ్, కస్తూరీ నాయక్‌ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు జోగేశ్వర్ దాస్, కార్యదర్శి గణేష్ కుమార్ సాహు, ఉపాధ్యక్షుడు మాధవ ఘొష్ తదితరులు పాల్గొన్నారు.