
యువకుడి మృతిపై ఆందోళన
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలంలోని పెద్దబమ్మిడి గ్రామానికి చెందిన పినిమింటి శ్రీరాములు(20) అనే యువకుడు శ్రీకాకుళంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే తన కుమారుడి మృతిపై అనుమానం ఉందంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు శ్రీరాములు ఈనెల 25వ తేదీన కొంతమంది యువకులతో కలిసి ద్విచక్ర వాహనంపై సారవకోట మండలం వైపు వెళ్లాడు. అయితే అదేరోజు రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో తమ కుమారుడిని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కానీ శ్రీరాములుది రోడ్డు ప్రమాదం కాదని, గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. తీవ్రగాయాలతో బ్రెయిన్ డెడ్ కావడంతో చికిత్స పొందుతూ శ్రీరాములు 27వ తేదీన మృతి చెందాడని, తన కుమారుడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి లక్ష్మణరావు, తల్లి లక్ష్మితో పాటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సోమవారం మృతదేహంతో పెద్దబమ్మిడి వద్ద ర్యాలీ చేపట్టారు. అయితే ఇదే విషయంపై సారవకోట పోలీసులను ప్రశ్నించగా మృతి చెందిన యువకుడు ఈనెల 25వ తేదీన సారవకోట మండలం జగ్గయ్యపేట వద్ద రోడ్డు పక్కన ఉన్న రైలింగ్‌ను ఢీకొన్నట్లు పేర్కొన్నారు. ఇది గుర్తించిన స్థానికులు చికిత్స నిమిత్తం 108లో శ్రీకాకుళం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 27వ తేదీన మృతి చెందినట్లు తెలిపారు. కాగా శ్రీరాములు అవయవదానానికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో జెమ్స్ ఆస్పత్రి సిబ్బంది ఆ యువకుడి అవయవాలను దానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

యువకుడి మృతిపై ఆందోళన