
జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు బీజేడీ ఫిర్యాదు
భువనేశ్వర్:
రాష్ట్రంలో ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్ సీనియర్ ప్రముఖ కార్యదర్శి, ప్రతినిధి డాక్టర్ లేఖశ్రీ సామంత్ సింగార్‌పై అధికార పక్షం భారతీయ జనతా పార్టీ సిటింగు ఎమ్మెల్యే సంతోష్ ఖటువా లైంగికంగా వేధించే, అవమానకరమైన, సీ్త్ర ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ)కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో న్యూ ఢిల్లీ లోని ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌కు విజయ రహత్కర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు పత్రం అందజేశారు. ఈ అవమానకర సంఘటనపై బాలాసోర్ జిల్లా నీలగిరి ప్రాంతంలో ప్రత్యేక బృందంతో విచారణ జరిపించి సంతోష్ ఖటువాని అరెస్టు చేసేందుకు పోలీసులను ఆదేశించాలని అభ్యర్థించారు. నిందితుల నుంచి బెదిరింపుల కారణంగా పీడిత డాక్టర్ లేఖశ్రీ సామంత్ సింగార్‌కు పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. డాక్టర్ సామంత్ సింగర్‌ను సిటింగు ఎమ్మెల్యేను వేశ్యగా పేర్కొని ఆమె సెక్స్ రాకెట్ నడుపుతోందని ఆరోపించి వ్యక్తిగత దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు, పౌరులు అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. బాధిత నాయకురాలు భువనేశ్వర్ మహిళా పోలీస్ ఠాణాలో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై ఇంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని కమిషను దృష్టికి తీసుకునివెళ్లారు. మూడు వారాలు గడిచినా భువనేశ్వర్ మహిళా పోలీసులు లేదా బాలసోర్ జిల్లా పోలీసు సూసపరింటెండెంటు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భారతీయ జనతా పార్టీ కూడా ఎమ్మెల్యేపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలను ప్రారంభించలేదని జాతీయ మహిళా కమిషన్‌కు వివరించారు. ఈ పరిస్థితుల పట్ల రాజకీయాలకు అతీతంగా స్వతంత్రంగా వ్యవహరించి సాటి మహిళకు సత్వర న్యాయం కల్పించేందుకు చొరవ కల్పించుకోవాలని బీజేడీ ప్రతినిధి బృందం కోరింది.