
జవాబుదారీతనం తప్పనిసరి
భువనేశ్వర్: బాలల సంరక్షణ సంస్థలు నిబద్ధత, జవాబుదారీతనంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా ఆదేశించారు. ఆయన అధ్యక్షతన స్థానిక లోక్ సేవా భవన్‌లో రాష్ట్ర స్థాయి బాలల రక్షణ, సంక్షేమ పర్యవేక్షణ సమీక్ష కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో బాలల రక్షణ, సంరక్షణ కార్యకలాపాల్లో సంస్థాగత, సంస్థేతర వర్గాల పని తీరుని సమీక్షించారు. బాలల సంరక్షణ సంస్థలలో నిర్వహించే యోగా సెషన్లపై వివరణాత్మక చర్చ జరిగింది.
ప్రస్తుతం 41 బాలల సహాయ యూనిట్లు, హెల్ప్ డెస్క్‌లు, రాష్ట్ర కంట్రోల్ రూమ్ పిల్లలకు మద్దతు అందించడానికి సమర్థంగా పనిచేస్తున్నట్లు అధికారులు వివరించారు. భారత ప్రభుత్వం చేపట్టిన మిషన్ వాత్సల్యను రాష్ట్రంలో సమర్థంగా అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో బాలల రక్షణ కోసం రాష్ట్ర, జిల్లా, గ్రామ పంచాయతీ స్థాయిలలో మూడు అంచెల బాలల సంక్షేమం, రక్షణ కమిటీలు రాష్ట్రంలో చురుగ్గా పనిచేస్తున్నాయని మహిళా, శిశు అభివృద్ధి డైరెక్టర్ మోనిషా బెనర్జీ తెలిపారు. దాదాపు 8,150 మంది పిల్లలు సంస్థాగత సంరక్షణలో ఉండగా, 6,317 మంది పిల్లలు సంస్థాగతేతర సంరక్షణలో ఉన్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో గత మూడేళ్లుగా దత్తత ఽఅభివృద్ధి స్థిరంగా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం బాలుర కంటే బాలికలను దత్తత తీసుకోవడం పెరుగుతుంది. రాష్ట్రంలో 160 బాలల గృహాలు, 33 ప్రత్యేక దత్తత సంస్థలు, 12 ఓపెన్ షెల్టర్లు, 7 పరిశీలన గృహాలు మరియు 7 ప్రత్యేక గృహాలు పని చేస్తున్నాయి. చైల్డ్ కేర్ సంస్థలలోని 8,150 మంది పిల్లలలో 98 శాతం మంది ఆధార్ కోసం నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం, 672 మంది పిల్లలు వృత్తి విద్యను అభ్యసిస్తున్నారు. 8,130 మంది వ్యక్తులు 264 వేర్వేరు కార్యక్రమాల ద్వారా శిక్షణ పొందారు. 211 మంది పిల్లలు ఉపాధి పొందగా, 79 మంది స్వయం ఉపాధి పొందారు. సంస్థాగత సంరక్షణ నుంచి బయటకు వచ్చిన పిల్లలకు వివాహ సహాయం అందిస్తున్నారు. అర్హులైన పిల్లలకు ఆశీర్వాద్ యోజన కింద ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇప్పటివరకు, 51,000 మందికి పైగా పిల్లలు ఆశీర్బాద్ యోజన పరిధిలోకి వచ్చారు. వీరంతా వివిధ ప్రయోజనాలు, సహాయం పొందుతున్నారు. సత్వర పిల్లల రక్షణ సహాయం కోసం చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, మహిళా హెల్ప్‌లైన్ 181 మరియు అత్యవసర ప్రతిస్పందన మద్దతు వ్యవస్థ 112 లను అనుసంధానించినట్లు వివరించారు.
యశోద పథకం కింద ప్రతి నాలుగేళ్లకు ఒకసారి అనాథ సర్వేలు నిర్వహణ కొనసాగుతుంది. అన్ని వర్గాల పిల్లల సంరక్షణ, రక్షణ సమాచారం వివరాలు డిజిటల్‌గా నవీకరించడానికి అమొరి శిశు పోర్టల్ పని చేస్తుంది.
వివిధ విభాగాల కార్యదర్శులు, సీనియర్ అధికారులను వారి జిల్లా పర్యటనల సమయంలో పాఠశాలలు, పిల్లల సంరక్షణ సంస్థలను సందర్శించాలని రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి, అభివృద్ధి కమిషనర్ అనూ గర్గ్ సూచించారు. సమీక్ష సమావేశంలో పలు శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులు, కమిషనర్ కమ్ కార్యదర్శులు, వివిధ విభాగాల సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా
రాష్ట్ర స్థాయి బాలల రక్షణ, సంక్షేమ పర్యవేక్షణపై సమీక్ష