మురుగు పారదు.. దుర్గంధం వదలదు | - | Sakshi
Sakshi News home page

మురుగు పారదు.. దుర్గంధం వదలదు

Apr 21 2025 12:51 AM | Updated on Apr 21 2025 1:01 AM

మెళియాపుట్టి: పరశురాంపురం పంచాయతీ పరిధిలోని హీరాపురం గ్రామంలోని కాలువలు మురుగు నీటితో దర్శనమిస్తున్నాయి. కాలువలు నిండి మురుగునీరు పారకపోవడంతో దుర్గంధం వెదజల్లతూ అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీని వల్ల వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయని, మురుగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా పంచాయతీ యంత్రాంగం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

విద్యుత్‌ షాక్‌కు గురై వ్యక్తి మృతి

టెక్కలి రూరల్‌: ఇంట్లో కరెంట్‌ లేదని దాన్ని మరమ్మతు చేసే క్రమంలో ఓ వ్యక్తి విద్యుత్‌ షాక్‌కు గురై ప్రాణాలు వదిలేశారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ఆదిఆంధ్ర వీధికి చెందిన పినిమింటి నారాయణరావు(40) అనే వ్యక్తి ఆదివారం తన ఇంట్లో కరెంట్‌ వచ్చి పోతుండటంతో స్విచ్‌ బోర్డుకి వచ్చే వైర్లు ఊడిపోవడం గుర్తించి దాన్ని మరమ్మతు చేసేందుకు పూనుకున్నారు. అయితే మరమ్మతు చేసే క్రమంలో ఒక్కసారిగా విద్యుత్‌ షాక్‌కు గురై కిందకు పడిపోయారు. దీంతో వెంటనే ఆయనను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి నారాయణరావు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదించారు. మృతుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి కీర్తన, మహేష్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు సేకరించారు.

ఆటో..బైక్‌ ఢీ: విద్యార్థికి గాయాలు

మెళియాపుట్టి: ఆటో బైక్‌ ఢీకొన్న సంఘటనలో మండలంలోని పెద్దమడి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న పడాల విజయ్‌ అనే విద్యార్థి గాయాల పాలయ్యాడు. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన విజయ్‌ ఆదివారం తన మామయ్య శ్రీనుతో కలిసి బైక్‌పై మెళియాపుట్టి నుంచి తన గ్రామానికి వెళ్తున్నాడు. మెళియాపుట్టి గ్రామ శివార్లలో వస్తున్న ఆటోని బైక్‌ ఢీకొనడంతో వెనుక కూర్చున్న విజయ్‌ దూరంగా ఎగిరిపడ్డాడు. దీంతో అతడి కాలికి గాయమైంది. వాహనం నడుపుతున్న శ్రీనుకు సైతం గాయాలయ్యాయి. 108 వాహనంలో ఇద్దరినీ టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యసేవల కోసం శ్రీకాకుళం తరలించినట్టు తెలిపారు.

ఆశాజనకంగా చోడి పంట

నరసన్నపేట: మండలంలో చోడి పంట ఆశాజనకంగా ఉంది. మెట్ట భూములతో పాటు సాగునీటి వసతులు ఉన్న పొలాల్లో రైతులు చోడిని వేశారు. రావులవలస, బొరిగివలస, బుచ్చిపేట, మడపాం, నడగాం, జమ్ము, తామరాపల్లితో పాటు గ్రామాల్లో రైతులు చోడిని వేశారు. మండలంలో 90 ఎకరాల్లో చోడి పంట ఉన్నట్లు వ్యవసాయ అదికారులు లెక్కలు తెలుపుతున్నాయి. గతంలో పోల్చితే చోడి పిండి వినియోగం ఆరోగ్య రీత్యా పెరగడంతో రైతులకు ఆదాయం వస్తుంది.

సత్యనారాయణ నేత్రదానం

శ్రీకాకుళం కల్చరల్‌: పట్టణంలోని ఇప్పిలి వీధిలో నివాసం ఉంటున్న నారంశెట్టి సత్యనారాయణ (86) అనారోగ్య కారణంగా మృతి చెందారు. మరణానంతరం ఆయన నేత్రాలు ఇతరులకు ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఆయన కుమారులు ఎన్‌వీ మొహెర్‌ సుధాకర్‌, ఎన్‌వీ సురేష్‌, ఎన్‌వీ రవికిషోర్‌, జగదీశ్వరరావులు బరాటం వరప్రసాద్‌ ద్వారా తండ్రి నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయం రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పి.జగన్మోహనరావుకు తెలియజేయగా, నేత్రసేకరణ కేంద్రం టెక్నికల్‌ ఇంచార్జి సుజాత, నంది ఉమాశంకర్‌లు సత్యనారాయణ కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్‌వీ ప్రసాద్‌ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. దాత కుటుంబ సభ్యులకు రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ జగన్మోహనరావు సభ్యులు దుర్గాశ్రీనివాస్‌లు అభినందించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 7842699321 నంబరుకు కాల్‌చేయాలని కోరారు.

మురుగు పారదు.. దుర్గంధం వదలదు 1
1/5

మురుగు పారదు.. దుర్గంధం వదలదు

మురుగు పారదు.. దుర్గంధం వదలదు 2
2/5

మురుగు పారదు.. దుర్గంధం వదలదు

మురుగు పారదు.. దుర్గంధం వదలదు 3
3/5

మురుగు పారదు.. దుర్గంధం వదలదు

మురుగు పారదు.. దుర్గంధం వదలదు 4
4/5

మురుగు పారదు.. దుర్గంధం వదలదు

మురుగు పారదు.. దుర్గంధం వదలదు 5
5/5

మురుగు పారదు.. దుర్గంధం వదలదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement