కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కొరాపుట్: తమ సమస్యలు పరిష్కరించాలని బీడీ ఆకులు సేకరించే కార్మికులు కోరారు. ఈ మేరకు నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో ఒడిశా కెందు పత్ర కర్మచారా సంఘం అధ్వర్యంలో ఆదివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంజిత్ మహంతి మాట్లాడుతూ బీడీ ఆకుల సేకరణపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో బీడీ ఆకులు సేకరించే కార్మికుల ఇంట్లో ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వం కెందు బోర్డు ద్వారా ఆర్థిక సాయం అందించేందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ సహాయాన్ని నిలుపుదల చేస్తుందనే ప్రచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అవిభక్త కొరాపుట్ జిల్లాలో బీడీ ఆకుల సేకరణపై వేలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. ప్రభుత్వం మానవతా దృష్టితో బీడీ ఆకులు సేకరించే కార్మికులకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం డీఎఫ్‌వో (కెందు లీప్) కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం నబరంగ్‌పూర్, కొరాపుట్ జిల్లాల సలహాదారుడు కున్ని అధికారి తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి


