అప్రమత్తతే శ్రీరామరక్ష
● గ్రామాల్లో ఆటలమ్మ, గవదబిళ్లల కేసులు ● వేసవి నేపథ్యంలో పెరుగుతున్న తీవ్రత ● పిల్లల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
పాతపట్నం:
వేసవి వచ్చిందంటే చాలు కొందరికి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా చిన్నారుల్లో చికిన్‌పాక్స్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. గవదబిళ్లలు, ఆటలమ్మగా పిలిచే ఈ సమస్య బారిన పడిన వారికి జలుబు, జ్వరం, శరీరంపై పొక్కులు, దవడలకు ఇరువైపులా వాపు, నొప్పి వంటివి తీవ్రంగా బాధిస్తాయి. అన్ని వయసుల వారికి ఈ అంటువ్యాధులు సోకే అవకాశమున్నా, ప్రధానంగా చిన్నారుల్లో ఎక్కువగా వస్తుంటుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే ముందు జాగ్రత్త, అప్రమత్తతతో వ్యవహరిస్తే దీని బారినపడకుండా రక్షణ పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. పదేళ్లలోపు చిన్నారుల విషయంలో మరింత శ్రద్ధ చూపాలని చెబుతున్నారు.
వ్యాధి నిరోధక శక్తి తక్కువుంటే..
సాధారణంగా వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకే చిన్నారులు బలవర్ధకమైన ఆహారం తీసుకునేలా తల్లిదండ్రులు చొరవచూపాలి. ఆటలమ్మ, గవదబిళ్లలు సోకిన వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. ఆకలి లేకపోవడం, ఆహారం సరిగా తీసుకోలేకపోవడం వంటి చర్యలు వల్ల తీవ్రంగా నీరసించిపోతారు. శరీరంపై నీటి పొక్కులు, జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే ఆటలమ్మగా గుర్తించి వైద్యులను సంప్రదించాలి. వ్యాధి తీవ్రత ఆధారంగా వైద్యుల సూచన మేరకు యాంటీవైరస్, యాంటీ బయోటిక్ మందులు వాడాల్సి ఉంటుందిల్లీ
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఆటలమ్మ సోకిన వారిని మిగతా వారికి దూరంగా ఉంచాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు ఇవ్వడం మంచిది.
గవదబిళ్లలు వచ్చిన వారికి గొంతునొప్పి తీవ్రంగా ఉంటుంది. తరచూ ద్రవపదార్థాలను ఆహారంగా తీసుకోవాలి.
ఆటలమ్మ, గవదబిళ్లలు వచ్చిన వారి విషయంలో ప్రజలు అపోహలు, మూఢ నమ్మకాలతో వైద్య సహాయం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అది మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే మెదడు, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యాధులు సోకకుండా ఉండేందుకు పిల్లలకు గోరువెచ్చని నీరు, శుభ్రమైన ఆహారం ఇవ్వడంతో పాటు పరిసరాల్ని పరిశుభ్రంగా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
నిర్లక్ష్యం తగదు..
ఆటలమ్మ, గవదబిళ్లల వ్యాధులపై నిర్లక్ష్యం తగదు. చిన్నారులు ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతుంటారు. వ్యాధి లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యులను సంప్రదించి వారి సూచనలు మేరకు మందులు వాడాలి.
– డాక్టర్ ఎస్.కృష్ణారావు,
సూపరింటెండెంట్, సీహెచ్‌సీ, పాతపట్నం
అప్రమత్తతే శ్రీరామరక్ష


