రణస్థలం: మండలంలోని బంటుపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న యూనైటెడ్ బ్రూవరీస్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగి పిన్నింటి అప్పలసూరి(47) అనుమానాస్పదంగా మృతి చెందాడు. జేఆర్‌పురం పోలీసులు, పరిశ్రమ వర్గాలు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం జనరల్ డ్యూటీకి వెళ్లిన మృతుడు అప్పలసూరి సాయంత్రం 4.30 గంటల సమయంలో పరిశ్రమలోని వాష్ రూమ్‌లో ప్లాస్టిక్ పైపునకు ప్యాకింగ్ రోప్‌తో ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. కొంత సమయం తర్వాత గుర్తించిన తోటి ఉద్యోగులు జేఆర్‌పురం పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈయన పరిశ్రమలోని కేస్ ఫ్యాకర్ మిషన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. బంటుపల్లి పంచాయతీ ప్రజలకు ఆర్‌ఎంపీగా వైద్య సేవలు అందిస్తుంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఉరివేసుకుని చనిపోయి ఉండడంపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతునికి భార్య అమ్ములు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడు స్వగ్రామం నరసన్నపేట దగ్గర లుకలాం కాగా, గత 30 ఏళ్లుగా ఉద్యోగరీత్యా జేఆర్‌పురం పంచాయతీలోని జీఎంఆర్ కాలనీలో నివాసముంటున్నాడు. జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.


