రాయగడ: ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా ఉత్కళ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ టౌన్ హాల్‌లో బుధవారం నిర్వహించిన మెహందీ పోటీలకు విశేష స్పందన లభించింది. మహిళలు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు మొత్తం 51 మంది పాల్గొన్నారు. మెహందీ పెట్టుకోవడంలో శుభ్రత, అందం, ఆధునిక డిజైన్ వంటి వాటికి ప్రాధాన్యత కల్పిస్తూ నిర్వాహకులు విజేతలను ఎన్నుకున్నారు. పోటీల్లో ప్రథమ బహుమతిని రాధారాణి కౌసల్య గెలుచుకోగా, ద్వితీయ బహుమతిని బి.ప్రితి, తృతీయ బహుమతిని పాయల్ దలాల్‌లు సొంతం చేసుకున్నారు. ఎం.మౌనిక, ఎంపీ ఇందు, సీహెచ్ గాయత్రీలకు ప్రోత్సాహక బహుమతులు అందించనున్నారు. విజేతలకు ఈనెల 30, 31వ తేదీల్లో స్థానిక కొల్లిగుడ మైదానంలో జరగనున్న ఉత్సవాల్లో బహుమతులు ప్రదానం చేస్తామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు యాల్ల కొండబాబు తెలియజేశారు.


