కనకదుర్గ వారధిపై ఇంజిన్‌ ఆయిల్‌ లీక్‌ | - | Sakshi
Sakshi News home page

కనకదుర్గ వారధిపై ఇంజిన్‌ ఆయిల్‌ లీక్‌

Jun 27 2026 1:31 AM | Updated on Jun 27 2026 1:31 AM

కనకదుర్గ వారధిపై ఇంజిన్‌ ఆయిల్‌ లీక్‌ యువత డ్రగ్స్‌ బారిన పడటం బాధాకరం

కృష్ణలంక(విజయవాడతూర్పు): కనకదుర్గ వారధిపై శుక్రవారం ఉదయం గుంటూరు నుంచి విజయవాడ వస్తున్న గుర్తు తెలియని వాహనం నుంచి ఇంజిన్‌ ఆయిల్‌ లీకై ప్రమాదకరంగా మారింది. ఆయిల్‌ మీదుగా ద్విచక్ర వాహనాలు ప్రయాణిస్తుండడంతో టైర్లు స్క్రిడ్‌ అయి ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలు నెమ్మదిగా వెళ్తుండడంతో వారధిపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఐదో ట్రాఫిక్‌ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. లీకై న ఆయిల్‌పై ఇసుక చల్లారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.

హోం మంత్రి అనిత

భవానీపురం (విజయవాడ పశ్చిమ): దేశాభివృద్ధికి యువశక్తే పెట్టుబడి అని, అటువంటి యువత డ్రగ్స్‌ బారినపడి నిర్వీర్యమైపోవడం బాధాకరమని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. నేటి తరం పిల్లలు ఎంతో చురుగ్గా ఉన్నా అవగాహన లోపంతో డ్రగ్స్‌ బారినపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గంజాయి, డ్రగ్స్‌ రవాణా చేసినా, దగ్గర ఉంచుకున్నా, వినియోగించినా ఎన్‌డీపీఎస్‌ చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రతిభావంతుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ.సూర్యకుమారి, ఈగల్‌ వింగ్‌ ఎస్పీ నగేష్‌ కుమార్‌, నేషనల్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఫర్‌ డ్రగ్‌ డిమాండ్‌ రిడక్షన్‌ సంస్థ రాష్ట్ర సమన్వయ అధికారి ఉమారాణి, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్‌ ఎల్‌ దినకర్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యతో పాటు సంస్కారం, నైతిక విలువలు అలవర్చుకోవాలి

ఆత్కూరు(గన్నవరం): చదువుతో పాటు మంచి సంస్కారం, నైతిక విలువలు, క్రమశిక్షణ, దేశభక్తి వంటి లక్షణాలను ప్రతి విద్యార్థి అలవర్చుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో వృత్తి విద్య కోర్సులో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ఆయన శుక్రవారం ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...విద్య ఉద్యోగానికే కాకుండా సమాజ వికాసానికి దోహదపడేదిగా ఉండాలని చెప్పారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించే బాధ్యతను విద్యార్థులు గుర్తుంచుకోవాలని తెలిపారు. వృత్తి విద్య యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే కాకుండా స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగేలా ఆత్మవిశ్వాస్వాన్ని పెంపొందిస్తుందన్నారు. స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ద్వారా అందిస్తున్న వృత్తి విద్య కోర్సులను యువతీ, యువకులు సద్వినియోగం చేసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌, ట్రస్ట్‌ ప్రతినిధులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement