ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ఈ నెల 29వ తేదీన నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించింది. 29వ తేదీ సోమవారం తెల్లవారుజామున 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభం కానుంది. ప్రత్యేక పూలవాహనంపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు, దేవస్థాన ప్రచార రథంపై మూర్తులతో ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఘాట్‌రోడ్డు వద్ద ఆలయ అర్చకులు, ఈవోలు పూజా కార్యక్రమాలను నిర్వహించి ఊరేగింపు ప్రారంభిస్తారు. కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాల సెంటర్, సితారా, కబేళా, పాల ప్రాజెక్టు, కేఎల్‌రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, నెహ్రూబొమ్మ సెంటర్, బ్రహ్మణ వీధి మీదగా అమ్మవారి ఆలయానికి చేరుకుంటుంది. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగే గిరి ప్రదక్షిణలో భక్తులు, సేవా సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొననున్నారు.
4న ట్రస్ట్ బోర్డు సమావేశం...
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం జూలై 4వ తేదీన బ్రహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశంలో ఆషాఢ సారె ఉత్సవాలు, శాకంబరీ ఉత్సవాలు, తెలంగాణ బోనాల నేపధ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.


