రైతుకు కన్నీరు! | - | Sakshi
Sakshi News home page

రైతుకు కన్నీరు!

Jun 27 2026 1:25 AM | Updated on Jun 27 2026 1:25 AM

● కాల్వను పూడ్చటంతో సరఫరా కాని సాగర్‌ జలాలు ● భూములను అమ్ముకుందామన్నా బెదిరిస్తున్న క్వారీ, క్రషర్ల యజమానులు ● కూటమి ప్రభుత్వంలో పెచ్చుమీరుతున్న కాంట్రాక్టర్ల ఆగడాలు దొనకొండ వద్ద క్వారీల సమీపంలో బీడుగా మారుతున్న పొలాలు

ఒకప్పుడు పచ్చని పైర్లతో కళకళలాడే చేలతో అన్నపూర్ణగా విలసిల్లిన పంట పొలాలు.. నేడు క్వారీల నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి పొరల కింద ఊపిరాడక విలవిలలాడుతున్నాయి. క్వారీల నుంచి ఎగసిపడే తెల్లని ధూళి మేఘాలు పంటలపై పేరుకుపోవడంతో దిగుబడి తగ్గిపోతోంది. ఫలితంగా కంచికచర్ల సమీపంలోని దొనకొండ రాతి క్వారీలు, క్రషర్ల నుంచి వెలువడే ధూళితో సారవంతమైన భూములు సైతం జీవం కోల్పోయి గుండె కోత మిగిల్చే బీడు భూములుగా మారుతున్నాయి. ఈ ఇబ్బందులపై రైతులు ఆందోళన చెందుతుంటే పాలకుల అండతో క్వారీల యజమానులు వీరిని బెదిరిస్తున్నారు.
క్వారీల దుమ్ము..

క్వారీల నుంచి లారీలతో కంకరను తరలిస్తున్న సమయంలో పంట పొలాల్లోకి ఎగిసిపడుతున్న దుమ్ము, ధూళి....

కంచికచర్ల: క్వారీల నుంచి వచ్చే దుమ్ము, ధూళి రైతుకు కన్నీరు తెప్పిస్తోంది. కంచికచర్ల సమీపంలో జాతీయ రహదారి పక్కన దొనబండ రాతి క్వారీలు, క్రషర్ల నుంచి వెలువడే దుమ్ము ధూళి కారణంగా రెండు పంటలు పండే పంట పొలాలన్నీ బీడు భూములుగా మారుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగు సమయంలో సాగర్‌ కాల్వను పూడ్చటంతో పంటలకు మూలపాడు మేజర్‌ కెనాల్‌ ద్వారా సాగునీరు అందక ఎండుతున్నాయి. తమ పొలాలను అమ్ముకుని ఇతర ప్రాంతాల్లో కొనుగోలు చేద్దామనుకుంటే క్రషర్‌ యజమానులు వాటిని విక్రయించవద్దని బెదిరిస్తున్నారు. తమ కుటుంబాలను ఏ విధంగా సాకాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

83 రాతి క్వారీలు.. 22 క్రషర్లు

కంచికచర్ల మండలం పరిటాల శివారు దొనబండ సమీపంలో 801 సర్వే నంబర్‌లో 83కు పైగా రాతి క్వారీలు, 22 క్రషర్లు ఉన్నాయి. వీటి సమీపంలో సుమారు 450 ఎకరాలు రెండు పంటలు పండే పంట భూములున్నాయి. వీటిలో రైతులు సాగు చేద్దామన్నా భూములు కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. నిత్యం వందల సంఖ్యలో లారీలకు భారీగా లోడింగ్‌ చేసి కంకర, మట్టి, పెద్ద పెద్ద కంకరను తరలిస్తున్నారు. దీంతో పంట పొలాల్లోకి కాలుష్యం నిరంతరం వెదజల్లుతోంది.

బ్లాస్టింగ్‌ ద్వారా పొలాల్లోకి వస్తున్న బండరాళ్లు

రాతి క్వారీలో నాణ్యతలేని నాసిరకం పేలుడు పదార్థాలను బ్లాస్టింగ్‌ సమయంలో వాడటంతో అవి పెద్ద పెద్ద శబ్దంతో పేలుళ్లు వినిపిస్తున్నాయి. అనుభవం లేని కార్మికులతో నిబంధనలకు విరుద్ధంగా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా బ్లాస్టింగ్‌ చేస్తున్నారు. ఆ బండరాళ్లన్నీ పొలాల్లోకి వచ్చి పడుతున్నాయి. అదే సమయంలో వ్యవసాయ పనులు చేసే రైతులు, కూలీలకు తీవ్రగాయాలైన సంఘటనలు ఉన్నాయి. నాణ్యత, మన్నిక లేని నాసిరకం పేలుడు పదార్థాలు గాతాల్లో పెట్టి రాళ్లను పేల్చుతున్నారు. వాటి ధాటికి ఇంటి గోడలు పెచ్చులూడి పడుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement