ఇబ్రహీంపట్నం: మామిళ్లపల్లిలో జరిగిన సంఘటనపై మాజీ మంత్రి జోగి రమేష్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు చేసిన ఫిర్యాదు మేరకు తెనాలి డీఎస్పీ జనార్ధనరావు బృందం గురువారం ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి చేరుకున్నారు. ఎన్‌హెచ్‌ఆర్‌సి ఆదేశాల మేరకు బుధవారం హాజరుకావల్సిన డీఎస్పీ గైర్హాజరయ్యారు. ఈనేపథ్యంలో వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గం సమన్వకర్త అంబటి మురళీకృష్ణ మరళా ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయిస్తామని ప్రకటించారు. దీంతో గురువారం జోగి రమేష్ ఇంటికి డీఎస్పీ చేరుకుని ఆయన స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. మేనెల 18న పొన్నూరు నియోజకవర్గం, మామిళ్ళపల్లిలో మొక్కజొన్న రైతును పరామర్శించడానికి వెళ్ళిన జోగి రమేష్, పలువురు రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులు, మహిళల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిన పోలీసుల తీరు, బలవంతంగా అరెస్ట్ చేసిన అంశాన్ని జోగి రమేష్ లిఖిత పూర్వకంగా అందజేశారు. అప్పట్లో ఆయనపై జరిగిన దాడి, దుర్భాషలకు చెందిన ఫొటోలు క్లిప్పింగ్‌లు ఫైల్, వీడియోల పెన్‌డ్రైవ్‌ను ఇచ్చారు. విచారణలో పాల్గొని స్టేట్‌మెంట్ ఇచ్చినట్లుగా జోగి రమేష్‌కు విచారణ పత్రాల సెట్టును అందించిన పోలీసులు తిరిగి వెళ్లారు.


