మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నిర్వహించడం అంటే కేవలం అమ్మకాలు చేయడం మాత్రమే కాదని లెక్కలు, చట్టాలు ఉంటాయని వాటిని సక్రమంగా సకాలంలో నిర్వ హించే వారే చార్టర్డ్ అకౌంటెంట్స్ అని ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయ వాడలోని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) విజయవాడ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఎమ్‌ఎస్‌ఎంఈ మహోత్సవ్–2026 కార్యక్రమం ఐసీఏఐ భవన్‌లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ... రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఎంఎస్‌ఎంఈల పాత్ర చాలా కీలకమన్నారు. యువతకు ఉపాధి కల్పనలో మైక్రో, స్మాల్ అండ్ మీడియం పరిశ్రమలు చాలా అవసరమని చెప్పారు. ఎంఎస్‌ఎంఈల స్థాపనకు సింగిల్ విండో విధానంలో అనుమతులు, సబ్సిడీలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, బ్యాంకుల నుంచి రుణాలను అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సౌకర్యాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని ప్రతి యువకుడు ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నారు. లోకల్ ఎంఎస్‌ఎంఈల నుంచి ఉత్పత్తి అయిన వస్తువులను ప్రజలు కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని కోరారు.
త్వరలో ఎంఎస్‌ఎంఈ శాఖతో ఒప్పందం
ఐసీఏఐ విజయవాడ బ్రాంచ్ చైర్మన్ ఉప్పులూరి జయంత్ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించేందుకు తమ బ్రాంచ్ ఆధ్వర్యంలో యువతకు అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. త్వరలో తమ బ్రాంచ్ ఎంఎస్‌ఎంఈ శాఖతో ఎంవోయూ కుదుర్చుకోనుందని చెప్పారు. ఐసీఏఐ సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ చైర్మన్ ఎం.సుబ్బారావు, ఐసీఏఐ విజయవాడ బ్రాంచ్ కార్యదర్శి వేముల వీరపవన్ కుమార్‌తో పాటుగా ఐసీఏఐ సభ్యులు, సీఏలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్‌ను ఐసీఏఐ బ్రాంచ్ సభ్యులు సత్కరించారు.
ఎంఎస్‌ఎంఈ మహోత్సవ్‌లో
మంత్రి కొండపల్లి శ్రీనివాస్


