ఏపీ పీటీడీ ఉద్యోగ సంఘాల జేఏసీ
భవానీపురం(విజయవాడపశ్చిమ): విద్యుత్ బస్‌ల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 88 నేపథ్యంలో ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని కాపాడుకునేందుకే ఉద్యమం చేపట్టాల్సి వచ్చిందని ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థ విలువైన ఆస్తులను ప్రైవేట్ ఆపరేటర్లకు కట్టబెట్టే ఆలోచనను విరమించుకుని, సంస్థను ప్రభుత్వం ఆధీనంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ రెండు రోజులు తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం విద్యాధరపురం ఆర్టీసీ జోనల్ వర్క్‌షాప్ వద్ద ధర్నా – గేట్ మీటింగ్ నిర్వహించింది. జేఏసీ నాయకులు ఎస్. కల్యాణ్ కుమార్, స్వామి, శ్రీనివాస్ (ఎన్‌ఎంయూ), రాష్ట్ర నాయకులు కె. కోటేశ్వరరావు, వి. శ్రీధర్, ప్రసాద్ (ఈయూ), పాపారావు (కార్మిక పరిషత్) పాల్గొని మాట్లాడారు. విద్యుత్ బస్(ప్రైవేట్) ఆపరేటర్ల కోసం రన్నింగ్‌లో ఉన్న డిపోలను ఖాళీ చేయించే విధానాలను మానుకోవాలన్నారు. సీ్త్ర–శక్తి పథకం విజయవంతంగా నడవాలంటే వెంటనే నాలుగు వేల కొత్త బస్‌లను ప్రవేశపెట్టాలని, ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 10వేల పోస్టులను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ సొంతంగా నిర్వహించాలి..
అన్ని రకాల బస్‌లు నడపగలిగే సామర్థ్యం ఉన్న డ్రైవర్లు ఆర్టీసీ సంస్థలో ఉండగా ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగించకుండా ఏపీఎస్‌ఆర్టీసీ సంస్థే సొంతంగా నిర్వహించాలని జేఏసీ నాయకులు కోరారు. ఆర్టీసీ సంస్థలో అపరిష్కృతంగా ఉన్న మరి కొన్ని సమస్యలపై బుధవారంకూడా ధర్నా కొనసాగుతుందని తెలిపారు.


