దుర్గమ్మకు తొలి సారె సమర్పించనున్న దుర్గగుడి ఈవో
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై జూలై 15 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఆషాఢ మాసోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ఉత్సవ మూర్తిని మహా మండపం ఆరో అంతస్తులో ప్రతిష్టించనున్నారు. ఆషాఢ మాసంలో తొలి రోజైన 15వ తేదీ బుధవారం ఉదయం 8.30 గంటలకు దేవస్థానం తరఫున ఆలయ ఈవో శీనానాయక్ అమ్మవారికి మొదటి సారెను సమర్పించనున్నారు. నెల రోజుల పాటు సాగే మాసోత్సవాలలో భక్తులు, సేవా బృందాలు, భక్త బృందాలు, ఆలయ ట్రస్టీలు, దేవస్థానాల తరఫున అమ్మవారికి చీరలు, పూజా సామగ్రి, మిఠాయిలు, కాయలు, పండ్లు, పసుపు, కుంకుమను సారెగా సమర్పిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఆషాఢ మాసం చివరి రోజైన ఆగస్టు 12వ తేదీ బుధవారం దేవస్థాన వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు, వేద పండితులు అమ్మవారికి సారెను సమర్పిస్తారు.
పక్కా ఏర్పాట్లు..
ఆషాఢ మాసోత్సవాలకు తోడు జూలై 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు, తెలంగాణ బోనాలను పురస్కరించుకొని నెల రోజుల పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ఈవో శీనానాయక్ ఆలయానికి చెందిన కీలక విభాగాల అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.


