అభివృద్ధి.. కనపడని చిత్తశుద్ధి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి.. కనపడని చిత్తశుద్ధి

Jun 23 2026 2:10 AM | Updated on Jun 23 2026 2:10 AM

అభివృద్ధి.. కనపడని చిత్తశుద్ధి

డైవర్షన్‌ కెనాల్‌ ఆధునికీకరణలో సగం పనులకే నిధుల విడుదల కాల్వకు అడ్డుకట్ట వేసి ఇటీవలే పనులు ప్రారంభం తొలకరి వానలు.. నత్తనడకన లైనింగ్‌ పనులు భారీ వర్షం పడితే వరద ముప్పే

క్లౌడ్‌ బరస్ట్‌ అయితే ఉప్పెనే

సాక్షి ప్రతినిధి, విజయవాడ: గతంలో వరదలు సృష్టించిన బీభత్సం నుంచి విజయవాడ పూర్తిగా తేరుకోలేదు. అప్పుడే వర్షాకాలం వచ్చేసింది. అయితే బుడమేరు ఆధునికీకరణపై ప్రభుత్వంలో చిత్తశుద్ధి కొరవడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గండ్లుపడిన చోట గతేడాది చేపట్టిన రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులే ఇప్పటికీ పూర్తి కాలేదు. వెలగలేరు వద్ద బుడమేరు హెడ్‌ రెగ్యులేటర్‌ పనులను మమ అనిపించి వదిలేశారు.

అరకొరగా నిధులు

బుడమేరు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి కృష్ణానది వరకు 11.90 కిలోమీటర్ల మేర బుడమేరు డైవర్షన్‌ కెనాల్‌ ఉంది. బుడమేరు ఆధునికీకరణలో భాగంగా దీన్ని పూర్తిగా లైనింగ్‌ చేయాల్సి ఉంది. వరదలొచ్చిపోయిన 20 నెలల తర్వాత ఇప్పుడు 0 కిలోమీటరు నుంచి 8.3 కిలోమీటర్ల వరకు లైనింగ్‌ పనులకు ప్రభుత్వం రూ.121కోట్లను మాత్రమే కేటాయించింది. మరో 3.600 కిలోమీటర్ల కెనాల్‌ పనుల ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌ ఉన్నాయి. నిధులను ఇటీవల విడుదల చేయడంతో కాంట్రాక్టర్‌ లైనింగ్‌ పనులను ఏప్రిల్‌ 18న మొదలు పెట్టారు. ఈ పనులకు కావాల్సిన వ్యవస్థను తరలించి పూర్తి స్థాయిలో చేపట్టేందుకు మరో నెల అంటే మే నెల సగంలో పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమయ్యాయి. తొలకరి వానలు పడుతుండడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి.

పునాది దశలోనే బ్యాలన్స్‌ రిటైనింగ్‌ వాల్‌

బుడమేరుకు 2024 ఆగష్టు 31న వచ్చిన వరదలకు వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి కృష్ణానది వరకు ఉన్న బుడమేరు డైవర్షన్‌ కెనాల్‌కు ఎడమ వైపున మూడు చోట్ల, కుడి వైపున ఏడు చోట్ల గండ్లు పడ్డాయి. డైవర్షన్‌ కెనాల్‌కు ఎడమ వైపున పడిన గండ్ల వద్ద రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు, వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ మరమ్మతుల కోసం అంటూ 2025, మార్చి 21వ తేదీన రూ.39.77కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీఓను విడుదల చేసింది. ఇది ఇచ్చిన యాభై రోజుల తర్వాత మే 15న శంకుస్థాపన చేసి రూ.28కోట్లతో రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం, రూ.1.80కోట్లతో రెగ్యులేటర్‌ మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. వీటిలో భాగంగా శాంతినగర్‌ వద్ద డైవర్షన్‌ కెనాల్‌ గండ్లు పడిన ప్రదేశంలో ఎడమవైపు నిర్మించే రిటైనింగ్‌ వాల్‌ 8.65 మీటర్ల ఎత్తు, 1.4 మీటర్ల వెడల్పు 500 మీటర్ల పొడవునా, కుడి వైపు అంటే శాంతినగర్‌ వైపున ఇదే కొలతలతో యాభై మీటర్ల పొడవునా రిటైనింగ్‌ వాల్‌ను నిర్మించాల్సి ఉంది. పనులు జరుగుతున్న సమయంలో పట్టిసీమ నీటిని విడుదల చేయడంతో ఎడమవైపు 360మీటర్లు పొడవున మాత్రమే రిటైనింగ్‌ వాల్‌ని నిర్మించి జూన్‌ 9న పనులు ఆపేశారు. ఇంకా ఎడమ వైపున బ్యాలన్స్‌ ఉన్న 140 మీటర్లు పొడవు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు ప్రస్తుతం ప్రారంభమై పునాది దశలోనే ఉండగా కుడి వైపున యాభై మీటర్ల పొడవునా నిర్మించాల్సిన రిటైనింగ్‌ వాల్‌ పనులు ఇంకా ప్రారంభించలేదు.

బుడమేరు డైవర్షన్‌ కెనాల్‌ లైనింగ్‌ పనులు చేయడానికి వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద డైవర్షన్‌ కెనాల్‌ వైపు వరదనీరు వెళ్లకుండా ఉండేలా భారీ కట్టను నిర్మించారు. డైవర్షన్‌ కెనాల్‌లో సైతం అక్కడక్కడా అడ్డుకట్టలను నిర్మించారు. ఇవే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక వైపు పనులు నత్తనడకన సాగుతుండటం.. వర్షాలు కూడా పడుతుండడంతో ఏ క్షణంలోనైనా భారీ వర్షం పడి గతంలో వచ్చినట్లు వరద మళ్లీ వస్తే పెను ప్రమాదమే జరిగే అవకాశం ఉంది. డైవర్షన్‌ కెనాల్‌కు అడ్డకట్టలు వేయడంతో ప్రస్తుతం వచ్చిన వరద హెడ్‌ రెగ్యులేటర్‌ గేట్ల నుంచి దిగువకు అంటే విజయవాడ వైపు బుడమేరులో ప్రవహించాల్సి ఉంది. ఈ రెగ్యులేటర్‌ 11అడుగుల ఎత్తుతో 11 గేట్లు మాత్రమే ఉండి 15వేల క్యూసెక్కుల వరద మాత్రమే అవుట్‌ ఫ్లో సామర్ధ్యం ఉంది. వరద పోయేందుకు మరో మార్గం కూడా లేకపోవడంతో ఏ క్షణంలో ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందోనని విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. జూలై నెలలో పట్టిసీమ నీళ్లను సైతం విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్న క్రమంలో లైనింగ్‌ పనులు పూర్తిగా ఆగిపోయి మరో ఆరు నెలల పాటు వేచి ఉండక తప్పదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement