‘సర్‌’ను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల అధికారి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల అధికారి

Jun 23 2026 2:10 AM | Updated on Jun 23 2026 2:10 AM

‘సర్‌’ను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల అధికారి ఏపీ పీటీడీ విజిలెన్స్‌ ఏడీకి అభినందనలు అన్ని శాఖల సమన్వయంతో పల్స్‌ పోలియో

పెనమలూరు: ప్రత్యేక సత్వర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని (సర్‌) పరిశీలించడానికి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌ పెనమలూరులో సోమవారం పర్యటించారు. ఆయన 132,134 పోలింగ్‌ బూత్‌లకు సంబంధించి సర్‌ ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బీఎల్వోలు, బీఎల్‌ఏలు సమన్వయంతో పని చేస్తున్నారా లేదా పరిశీలించారు. ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ, ఇంటింటి సర్వే నిర్వహణ, మరణించిన ఓటర్ల గుర్తింపు, వలస వెళ్లిన ఓటర్ల నమోదు, తాళం వేసి ఉన్న ఇళ్ల విషయంలో అనుసరిస్తున్న విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెనమలూరు నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి ఎస్‌.కరుణకుమారి వివరాలు తెలుపుతూ ఎన్యూమరేషన్‌ ఫారాలను 71.44 శాతం పంపిణీ చేశామని, ఇంటికి తాళాలు వేసిన కేసుల్లో బీఎల్వోలు మూడుసార్లు గృహాలు సందర్శించారని తెలిపారు. చనిపోయిన ఓటర్ల కేసుల్లో మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్‌ ఇవ్వకపోతే పంచనామా చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌ మాట్లాడుతూ సర్‌ విషయంలో బీఎల్వోలు నిర్లక్ష్యం చేయకుండా పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌, ఏఈఆర్‌వో శివకుమార్‌రాజు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

బస్టాండ్‌(విజయవాడ పశ్చిమ): ఏపీ పీటీడీ (ఆర్టీసీ) విజిలెన్స్‌, సెక్యూరిటీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏడీ)గా బాధ్యతలు తీసుకున్న ఎస్‌.వినోద్‌కుమార్‌ను సోమవారం పీటీడీ విజిలెన్స్‌, సెక్యూరిటీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు కలిసి అభినందించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డి.అంకినీడు ఆధ్వర్యాన విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో జోనల్‌, రీజనల్‌ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశ్వరరావు, అడిషనల్‌ జనరల్‌ సెక్రటరీ కొండారెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రవి, నాయకులు రవి, అనంతకుమార్‌, ఆదామ్‌, జాన్‌బాబు, గురవయ్య తదితరలు పాల్గొన్నారు.

మచిలీపట్నంఅర్బన్‌: జిల్లాలో ఈ నెల 28వ తేదీ నిర్వహించనున్న పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కృష్ణా కలెక్టర్‌ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్‌లో పల్స్‌ పోలియోపై జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, జేసీ నవీన్‌ పల్స్‌ పోలియో ప్రచార వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా పకడ్బందీ ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి యుగంధర్‌ మాట్లాడుతూ ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేసేలా మైక్రో ప్లానింగ్‌ రూపొందించడం, బూత్‌ల ఏర్పాటు, వ్యాక్సిన్‌ సరఫరా, కోల్డ్‌చైన్‌ నిర్వహణ, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. అనంతరం మిగిలిపోయిన పిల్లలను గుర్తించి ఇంటింటి సందర్శనలతో పోలియో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు. జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ కె.ప్రేమ్‌చంద్‌ మాట్లాడుతూ విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్‌ శాఖ, మున్సిపల్‌ శాఖ, రవాణా శాఖ, సమాచార, ప్రజా సంబంధాల శాఖలతో పాటు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సంపూర్ణ సహకారం అందించాలని సమావేశంలో నిర్ణయించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement