గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీఎస్ ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని వైఎస్సార్ టీయూసీ జోనల్ ఇన్‌చార్జి నారపరెడ్డి రాజారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు విశ్వనాథ రవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల గోవిందరాజులు డిమాండ్ చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ లక్ష్మీశకు వైఎస్సార్‌టీయూసీ నేతలు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ చక్రం ప్రజా ప్రగతికి చిహ్నమనే నినాదం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ఆలోచన చేస్తోందన్నారు. కూటమి పాలనలో ఆర్టీసీ ఉద్యోగులపై, ప్రజల పాలిట కర్కోటకంగా వ్యవహరిస్తోందన్నారు. 2015 –16 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 59,300 ఉంటే.. ఆ సంఖ్య ప్రస్తుతం తగ్గిందన్నారు. గతంలో అద్దె బస్సులతో కలిపి ఆర్టీసీలో 12,500 బస్సులు ఉంటే, ఇప్పుడా సంఖ్య 10,700 వచ్చిందన్నారు.
వైఎస్సార్ సీపీ హయాంలో
కొత్త బస్సుల కొనుగోలు
గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి బస్సులు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ బస్సులను వారి ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. ఆర్టీసీని నష్టాలు సాకుగా చూపి ప్రైవేటుకు ధారాదత్తం చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, బస్‌డిపోలను అద్దెకు ఇచ్చే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ధోరణి ఇదేవిధంగా కొనసాగితే అన్ని సంఘాలు, ప్రజల సహకారంతో ఉద్యమిస్తామన్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి జీవీ నారాయణ రెడ్డి, జిల్లా నాయకులు ఎస్‌కే అక్బర్, ఎం.రామారావు, బి.రాజేష్, ఎస్.నారాయణ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ టీయూసీ


