ప్రజా విశ్వాసమే పని తీరుకు ప్రమాణం | - | Sakshi
Sakshi News home page

ప్రజా విశ్వాసమే పని తీరుకు ప్రమాణం

Jun 23 2026 2:10 AM | Updated on Jun 23 2026 2:10 AM

పీజీఆర్‌ఎస్‌ను పరిశీలించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రజల విశ్వాసమే అధికారుల పనితీరుకు అసలైన ప్రమాణమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) జి.సాయిప్రసాద్‌ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కా రంలో వేగం, పారదర్శకత, జవాబుదారీతనం.. అన్నింటికీ కంటే ముఖ్యంగా నాణ్యత, సంతృప్తికర పరిష్కారం ముఖ్యమన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని సీఎస్‌ సాయిప్రసాద్‌.. సీసీఎల్‌ఏ జి.జయలక్ష్మితో కలిసి సందర్శించారు. కొంత సమయం ప్రజల అర్జీలను పరిశీలించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై లిఖిత పూర్వకంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల నుంచి రెవెన్యూ సేవలతో పాటు వివిధ అంశాలకు సంబంధించి స్వీకరిస్తున్న వినతులు, వాటి ఆన్‌లైన్‌ నమోదు విధానం, సంబంధిత శాఖలకు పంపిణీ, పరిష్కార చర్యలు, అధికారుల మధ్య సమన్వయం, పర్యవేక్షణ తదితర అంశాలను సీఎస్‌ పరిశీలించారు. ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించడంతో ప్రభుత్వంపై నమ్మకం మరింత పెరుగుతుందన్నారు. జిల్లాస్థాయిలో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమ నిర్వహణ, ఫిర్యాదుల స్వీకరణ ప్రక్రియ, వాటి నమోదు తీరుతెన్నులు, పరిష్కారానికి అనుసరిస్తున్న విధానం తదితరాలను పరిశీ లించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తీరును కలెక్టర్‌ జి.లక్ష్మీశ వివరించగా సీఎస్‌ సాయిప్రసాద్‌ అభినందించారు.

మొత్తం 177 అర్జీలు

జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 177 అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూ 51, పోలీస్‌ 33, ఎంఏయూడీ 28, పంచాయతీరాజ్‌ 22, ఏపీఎస్‌ డబ్ల్యూఆర్‌ఐఈఎస్‌ 6, డీఆర్డీఏ 4, విద్య 4, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ 4, ఏపీసీపీడీసీఎల్‌ 3, గనులు 3, ఏపీఎస్‌ ఆర్టీసీ 2, వైద్య 2 అర్జీలు వచ్చాయి. వ్యవసాయం, బ్యాంకింగ్‌ సేవలు తదితర విభాగాల నుంచి ఒక్కో అర్జీ వచ్చాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ, డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, పీజీఆర్‌ఎస్‌ నోడల్‌ అధికారి జి.జ్యోతి, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement