ఘంటసాల: ఘంటసాలలో 2025–26లో జరిగిన ఉపాధి హామీ పథకం పనులను ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ఆడిట్ బృందం సోమవారం పరిశీలించింది. ఈ సందర్భంగా సెంట్రల్ ఆడీట్ సీఓఎం వనీత చౌదరి, పింకు కుమార్ మండల కంప్యూటర్ సెంటర్‌లో బిల్లులను ఎఫ్‌టీఓలు ఎలా అప్‌లోడ్ చేస్తున్నారో గమనించారు. పంచాయతీలో పంచాయతీరాజ్ శాఖలో నిర్మించిన సీసీ రోడ్లు ఫైల్స్ ఎం బుక్, రికార్డులు చూడటంతో పాటు ఆన్‌లైన్‌లో కూడా సక్రమంగా ఉన్నాయో లేవో చూశారు. పశువుల షెడ్లు, మేకలు, గొర్రెల షెడ్లు నిర్మాణాలు, వినియోగం, పంట బోదెలు, పంట కాలువల్లో చేసిన ఉపాధి ఫైల్స్, ఏడు రిజిస్టర్ల నమోదును క్షుణ్ణంగా తనఖీ చేశారు. పశువుల షెడ్లను పరిశీలించి యజమానులతో మాట్లాడి అభిప్రాయాలను సేకరించారు. ఆకస్మికంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రావడంతో మండలంలోని ఇతర గ్రామాల్లో పర్యటించకుండానే కేంద్ర బృందం వెనుతిరగడంతో కొన్ని గ్రామాల ఎఫ్‌ఏలు, అధికారులు ఊపిరిపీల్చుకోవడం కొసమెరుపు. ముందుగా ఘంటసాల మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన కేంద్ర ఆడిట్ బృందం సభ్యులు వనిత చౌదరి, పింకు కుమార్‌ను ఎంపీడీవో సుబ్బారావు సత్కరించారు. డ్వామా పీడీ ఎన్వీ శివప్రసాద్ యాదవ్, మచిలీపట్నం, ఉయ్యూరు ఏపీడీలు రామమోహన్, లక్ష్మీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


