‘కేజీఎఫ్‌’ను మించిన రీతిలో అక్రమ క్వారీయింగ్‌ | - | Sakshi
Sakshi News home page

‘కేజీఎఫ్‌’ను మించిన రీతిలో అక్రమ క్వారీయింగ్‌

Jun 23 2026 2:10 AM | Updated on Jun 23 2026 2:10 AM

‘కేజీఎఫ్‌’ను మించిన రీతిలో అక్రమ క్వారీయింగ్‌ ● అధికారులు తనిఖీ చేసి జరిమానా విధించాలి ● కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి జోగి రమేష్‌

● అధికారులు తనిఖీ చేసి జరిమానా విధించాలి ● కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి జోగి రమేష్‌

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): మైలవరం నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్‌, మైనింగ్‌ దోపిడీకి పాల్పడుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులను తప్పకుండా చట్టం ముందు నిలబెడతామని మాజీ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నామన్నారు. ఇందులో భాగంగా దాములూరి ఇసుక క్వారీలో అక్రమాలను బహిర్గతం చేశామన్నారు. అలాగే జి. కొండూరు మండలం శేగురెడ్డిపాడు గ్రామంలో జరుగుతున్న అక్రమ క్వారీయింగ్‌ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చామన్నారు. ఆ గ్రామంలో పర్యావరణ విధ్వంసం కొనసాగుతోందన్నారు. అనుమతులు ఒక చోట తీసుకొని మరో చోట మైనింగ్‌ సాగిస్తున్నారన్నారు. అక్కడ కేజీఎఫ్‌ సినిమాను తలపించే రీతిలో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశను కలిసి వినతి పత్రం అందజేశారు. మైనింగ్‌ దోపిడీ ఏ విధంగా జరుగుతుందో వీడియో క్లిప్పింగ్‌, ఫొటోలతో ఆధారాలన్నీ కలెక్టర్‌కు అందజేశారు. నియోజక వర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే సాగిస్తున్న దోపిడీపై జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు. అనంతరం కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఊసరవెల్లిలా ఎమ్మెల్యే..

ఇసుక, గ్రావెల్‌, బూడిద, మైనింగ్‌ దోపిడీ ఏ విధంగా జరుగుతుంది? ఎంత పరిమాణంలో దోచుకున్నారు? జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌లో తేల్చి.. నాలుగైదు రెట్లు జరిమానా విధించాలని కలెక్టర్‌ను కోరినట్లు జోగి రమేష్‌ చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఇసుక, గ్రావెల్‌, లిక్కర్‌, బూడిద ఇలా ప్రతిదాంట్లో పావలా వాటా వెళ్తోందన్నారు. ఆయన ఊసరవెల్లిగా మారారన్నారు. పార్టీలు మారడం, సూట్‌ కేసులు పంపడం ఆయన ప్రవృత్తిగా మారిందన్నారు. పంపిన సూట్‌కేసులకు సరిపడా మైనింగ్‌ ద్వారా అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. నిర్భయంగా, యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారన్నారు.

సర్కారుకు దమ్ముందా?

గుంటుపల్లి, ఫెర్రీ పవిత్ర సంగమంలో ఫంటు పేరుతో ఇసుక డ్రెడ్జింగ్‌ చేస్తూ లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని జోగి ఆరోపించారు. కొత్తూరు తాడేపల్లి, వెలగలేరులో గ్రావెల్‌ ద్వారా కోట్లాది రూపాయలు దండుకుంటున్నారన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌కు ఇక్కడ ఎమ్మెల్యే చేసే దాన్లో వాటా ఉందా అని ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేసే దమ్మూ ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని నిలదీశారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే అవినీతి నిరూపించి న్యాయ స్థానంలో నిలబెడతామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement