‘ఫీజు’ బకాయిలను విడుదల చేయాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

‘ఫీజు’ బకాయిలను విడుదల చేయాలని ధర్నా

Jun 23 2026 2:10 AM | Updated on Jun 23 2026 2:10 AM

‘ఫీజు’ బకాయిలను విడుదల చేయాలని ధర్నా రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తికి జైలు శిక్ష వీసా రెన్యూవల్‌ కేసులో విచారణ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్‌) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. సోమవారం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నాను ఉద్దేశించి ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సాయికుమార్‌ మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. రూ. 10వేల కోట్లు పైచిలుకు ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో మూతబడ్డ 4,500 పాఠశాలలను పునఃప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు రాజు, దీపక్‌, యశ్వంత్‌, సాయి, దివ్య తదితరులు పాల్గొన్నారు.

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ఒకరి మరణానికి కారకుడైన వాహన చోదకుడు అంకం ప్రవీణ్‌ శ్రీనివాస్‌కు నూజివీడు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధించినట్లు వీరవల్లి ఎస్‌ఐ సత్యం సురేష్‌ సోమవారం తెలిపారు. వివరాలు ఇవి.. 2023 డిసెంబర్‌ 22వ తేదీన బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద అతివేగంగా వస్తున్న కారు అదుపు తప్పి హైవే మధ్యలో ఉన్న డివైడర్‌ను సైతం దాటుకుని అవతల వైపు రోడ్డు మీదకు వెళ్లింది. ఆ రోడ్డులో ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొనటంతో ఆ కారులో ప్రయాణిస్తున్న కేరళకు చెందిన లాజర్‌ పి.థామస్‌ (60) అనే వ్యక్తి దుర్మరణం చెందటంతో పాటుగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు గ్రామంలోని కాఫీ ఫ్యాక్టరీలో మిషనరీ పరిశీలించేందుకు కేరళ నుంచి వచ్చిన థామస్‌ తిరిగి వెళ్లేందుకు కారులో గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరగా, ఈ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనపై అప్పటి వీరవల్లి ఎస్‌ఐ ఎం.చిరంజీవి కేసు నమోదు చేయటంతో పాటుగా విచారణ పూర్తి చేసి కోర్టుకు చార్జీషీట్‌ సమర్పించారు. ఈ కేసులో ఏపీపీ వి.ప్రసన్న వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి నిందితుడు అంకం ప్రవీణ్‌ శ్రీనివాస్‌కు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

పోలీసుల ఎదుట హాజరైన

యూట్యూబర్‌ నందు మామయ్య మోహనరావు

ఇబ్రహీంపట్నం: యూట్యూబర్‌, సినీ నటి రమానందన (నందు) భర్త తండ్రి జాగర్లమూడి మోహనరావును ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు సోమవారం స్టేషన్‌లో విచారించారు. ఇప్పటికే నందు కుటుంబంపై లుక్‌ అవుట్‌ నోటీసులు పోలీసులు జారీ చేశారు. తన వ్యక్తిగత లాయర్‌తో కలిసి మోహనరావు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫొటోలు, వీడియోలు తీయరాదని మీడియా ప్రతినిధులతో అతడి లాయర్‌ గొడవకు దిగారు. విచారణలో.. నందు దంపతులు ఎక్కడున్నారు? వారు చేసే వ్యాపారంలో మీ పాత్ర ఏమిటి? ఇప్పటి వరకు ఎంత మంది వీసాలు రెన్యూవల్‌ చేశారు? వీసాల రెన్యూవల్‌లో మీ కుటుంబంతో పాటు ఇంకా బయట వ్యక్తులు ఎవరెవరు ఉన్నారనే ప్రశ్నలు పోలీసులు వేసినట్లుసమాచారం.

అసలేం జరిగిందంటే..

పశ్చిమ ఇబ్రహీంపట్నానికి చెందిన బాధితుడు మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్‌ తన యూకే వీసా రెన్యూవల్‌ చేయాలని గతంలో డెస్టినీ సంస్థను ఆశ్రయించగా, ఇండియాలో ఉన్న తమ సంస్థకు రూ.15 లక్షలు చెల్లించాలని వారు నమ్మబలికారు. రూ.15 లక్షలు తీసుకున్న తర్వాత ముఖం చాటేయడంతో అతను ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు నిందితులుగా ఉన్న డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్‌ జాగర్లమూడి మధుకర్‌, ఆయన భార్య రమానందన, మధుకర్‌ తండ్రి మోహనరావుపై కేసు నమోదు చేశారు. నందు దంపతులు అందుబాటులో లేకపోవడంతో మోహనరావును తీసుకువచ్చి విచారించిన అనంతరం పంపించేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement