లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి 90 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజలు నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. వారి సమస్యలు తెలుసుకుని, సత్వరమే పరిష్కరించాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను డీసీపీ ఉదయరాణి ఆదేశించారు. కాగా భూ, ఆస్తి వివాదాలకు సంబంధించి 31, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 12, వివిధ మోసాలపై 9, మహిళా సంబంధిత నేరాలపై 5, కొట్లాటలపై 2, దొంగతనాలపై 5, ఇతర వివిధ సమస్యలపై 26 ఫిర్యాదులు అందాయి.
పెనమలూరు: యనమలకుదురు కొండ వెనుక గత కొద్ది రోజుల క్రితం ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. పెనమలూరు పోలీసులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీన యనమలకుదురు కొండ వెనుక నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని ట్రాక్టర్ ఢీ కొట్టడంతో అతను మృతి చెందాడు. అయితే పోలీసులు వివిధ కోణాల్లో విచారించి మృతుడు పశ్చిమబెంగాల్ రాష్ట్రం బిర్బూమ్ జిల్లా బారాలుండా పోస్టు పార్సిములై గ్రామానికి చెందిన లాలుబాస్కీగా గుర్తించారు. అతను పనులు చేయటానికి యనమలకుదురుకు వచ్చి ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు బంధువులకు సమాచారం అందించగా.. వారు వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. పీఎం అనంతరం మృతదేహాన్ని బంధువులకు పోలీసులు అప్పగించారు.
జి.కొండూరు: చెత్త లోడుతో వస్తున్న లారీ అదుపుతప్పి కాల్వలో బోల్తా పడిన ఘటన హెచ్. ముత్యాలంపాడు వద్ద సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా ముదినేపల్లికి చెందిన డ్రైవర్ బొర్రా వీర నాగ శ్రీనివాసరావు లారీలో చెత్తను నింపుకొని జి.కొండూరు వైపు వస్తున్నాడు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తుండటంతో జి.కొండూరు మండల పరిధి హెచ్. ముత్యాలంపాడు వద్ద బుడమేరు వంతెన దాటగానే లారీ అదుపు తప్పి సైడ్ కాల్వలో బోల్తా పడింది. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన వీర నాగ శ్రీనివాసరావుని స్థానికులు దగ్గర్లో ఉన్న క్లినిక్‌కి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం సమాచారం అందుకున్న జి.కొండూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఘంటసాల: పదేళ్ల వయస్సులో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కోలవెన్ను ప్రణతి చేసిన నాట్య ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. మధుర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు ఘంటసాల గ్రామంలో చేసిన గాన కచేరి 60ఏళ్లయిన సందర్భంగా ఘంటసాల కళాసమితి ఆధ్వర్యంలో శ్రీజలధీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం ఈ నృత్య ప్రదర్శన నిర్వహించారు. నృత్య ప్రదర్శన అనంతరం ఘంటసాల కళాసమితి ఆధ్వర్యంలో సమితి గౌరవాధ్యక్షుడు గొర్రెపాటి రామకృష్ణ చిన్నారి ప్రణతిని ఘనంగా సత్కరించారు. కళా సమితి అధ్యక్ష, కార్యదర్శులు ఘంటసాల కృష్ణ మోహన్, పోతన వెంకటేశ్వరరావు, పామర్రులోని ఘంటసాల కళాపీఠం వ్యవస్థాపకుడు కాటూ రు వెంకట మురళీ కృష్ణ, ప్రణతి తల్లిదండ్రులు విజయ్ కుమార్, బాల భార్గవి పాల్గొన్నారు.


