మచిలీపట్నంఅర్బన్: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంటీఎస్ (మినిమం టైమ్ స్కేల్) ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ మరోసారి గందరగోళానికి దారితీసింది. బదిలీలకు సంబంధించిన పూర్తి ఖాళీల వివరాలను విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరచకుండానే కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధపడటంపై ఉపాధ్యా యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పారదర్శకత లేకుండా కౌన్సెలింగ్ నిర్వహించడంతో ఉపాధ్యాయులకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డీఎస్సీ–2008, డీఎస్సీ–1998 బ్యాచ్‌లకు చెందిన ఎంటీఎస్ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌ను సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కార్యాలయంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా డీఎస్సీ–2008, అనంతరం డీఎస్సీ–1998 ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు.
ఖాళీల వివరాలు ఏవి?
అయితే జిల్లాలో ఉన్న అన్ని ఖాళీల వివరాలు అందుబాటులో లేకపోవడంతో ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్ ఉపాధ్యాయుల బదిలీల్లో అనుసరించే ప్రమాణాలు ఎంటీఎస్ ఉపాధ్యాయుల విషయంలో ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. పూర్తి ఖాళీల జాబితాను ప్రకటించకుండా కౌన్సెలింగ్ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని, ఇది ఉపాధ్యాయుల ఎంపిక హక్కును పరిమితం చేసే చర్యగా మారుతుందని విమర్శించారు. దీంతో కౌన్సెలింగ్‌ను బహిష్కరించిన ఎంటీఎస్ ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. మొత్తం ఖాళీలు ప్రకటించాలని, పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలంటూ నినాదాలు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులతో చర్చల అనంతరం ఎంటీఎస్ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ సోమవారం పొద్దుపోయాక ప్రారంభమైంది.
పారదర్శకత లేని బదిలీలపై ఎంటీఎస్ ఉపాధ్యాయుల ఆగ్రహం


