అప్పు తిరిగి చెల్లించమన్నందుకు మహిళపై దాడి | - | Sakshi
Sakshi News home page

అప్పు తిరిగి చెల్లించమన్నందుకు మహిళపై దాడి

Jun 23 2026 2:10 AM | Updated on Jun 23 2026 2:10 AM

మైలవరం: అప్పుగా ఇచ్చిన సొమ్ములు తిరిగి ఇవ్వమని మహిళ అడిగితే ఆమైపె దాడి చేసిన సంఘటన మైలవరం మండలం తోలుకోడు గ్రామంలో సోమవారం జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వెంకటేశ్వరమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈమెకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి(చల్లా కోటయ్య) ఇటుక బట్టీలు వ్యాపారం నిర్వహిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో 2020లో అతను వెంకటేశ్వరమ్మ వద్ద నుంచి రూ. 4లక్షలను వ్యాపారం నిమిత్తం తీసుకుని 4, 5 నెలల్లో తిరిగి వడ్డీతో చెల్లిస్తానని చెప్పాడు. వీరి ఒప్పందం ప్రకారం సమయం దాటిపోయిన డబ్బులు చెల్లించకపోవడంతో బాధితురాలు వెంకటేశ్వరమ్మ పదేపదే తన డబ్బులు తనకు ఇవ్వమని అడుగుతోంది. తన పిల్లలు, భర్తతో కలిసి ఆ వ్యక్తిని పలుమార్లు అడిగారు. దానికి బదులుగా ఆ వ్యక్తి నేను ఇవ్వను, నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరించాడు. సోమవారం ఉదయం వెంకటేశ్వరమ్మ తనకు ఇవ్వాల్సిన డబ్బులు గురించి అడగ్గా అసభ్య పదజాలంతో దూషించి ఆ వ్యక్తి ఆమైపె దాడి చేశాడు. ఈ అవమాన భారంతో వెంకటేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ట్యాబ్లెట్స్‌ మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఇది గమనించిన భర్త, కుటుంబ సభ్యులు వెంకటేశ్వరమ్మను ఆటోలో మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మైలవరం పోలీసులకు కుటుంబ సభ్యులు వెంకటేశ్వరమ్మ పరిస్థితిని వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement