మంత్రి సత్యకుమార్ యాదవ్
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): యోగా సాధనతో జీవన శైలి వ్యాధులు దూరమవుతాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యోగాంధ్ర–2026లో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మూడు రోజులుగా గుంటుపల్లి డాన్‌బాస్కో పాఠశాలలో జరిగిన యోగా పోటీలు శనివారం ముగిశాయి. ఈ పోటీల్లో సుమారు 1600 మంది పాల్గొనగా, ప్రతిభకలిగిన 108 మంది విజేతలుగా నిలిచారు. వారికి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ కె.వి.ఎస్.చక్రధర్‌బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, జేసీ ఎస్.ఇలక్కియాతో కలసి జ్ఞాపికలు, సర్టిఫికెట్‌లను మంత్రి అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రాచీన వారసత్వ సంపదను విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొదటి నుంచి విశేష కృషి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగాతో శారీరక దృఢత్వంతో పాటు, మానసిక ప్రశాంతత, సృజనాత్మకత, ఏకాగ్రత పెరుగుతా యని వివరించారు. ఈ సంవత్సరం ఆరోగ్యకర వృద్ధాప్యానికి యోగా థీమ్‌తో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుతున్నామని పేర్కొన్నారు. నిత్యం 45 నిమిషాలు యోగాకు కేటాయించాలని సూచించారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. యోగా సాధన వల్ల ఆరోగ్యం మాత్రమే కాకుండా మనసు, శరీరం మధ్య సమన్వయం ఏర్పడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం యోగా సాధన చేయాలని సూచించారు. కార్యక్రమంలో సమన్వయ అఽధికారులు సుజాత, కృష్ణవేణి, సుకన్య, జిల్లా ఆయుష్ అధికారి రత్న ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.


