సమాచారం కరువు..
● అరగంట ఆన్.. పావు గంట ఆఫ్..
● సర్కారు వారి అప్రకటిత విద్యుత్ కోతలు
● చినుకు పడితే కట్.. చెట్టు ఊగితే కట్
● ఉక్కపోతతో అవస్థలు పడుతున్న ప్రజలు
డీటీఆర్‌లపైన ఉండే హెచ్‌జీ ఫ్యూజ్ వైర్ గుండా ఉడతలు, బల్లులు వెళ్లటం వల్ల ఫీడర్‌లు ట్రిప్ అయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. శుక్రవారం మధ్యాహ్న సమయంలో నందిగామ పట్టణంలోని అయ్యప్ప స్వామి వారి ఆలయ సమీపంలో డీటీఆర్ కేబుల్ వైర్‌కు ట్రాక్టర్ తగలడం వల్ల ఫీడర్ ట్రిప్ అయి కొంత సమయం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమస్య తలెత్తిన వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. – నాగేశ్వరరావు,
విద్యుత్ శాఖ ఏఈ, నందిగామ టౌన్
నందిగామ రూరల్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా పరిస్థితి అర గంట ఆన్.. పావు గంట ఆఫ్.. అన్న చందంగా మారింది. విద్యుత్ శాఖాధికారులు విధిస్తున్న అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు, మూడు రోజుల నుంచి ఎండ వేడిమి తగ్గినప్పటికీ భరించలేని ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. చిన్నారులు, వృద్ధుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. దీనికి తోడు గంటల తరబడి విద్యుత్ కోతలను దశల వారీగా అమలు చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో గంటకు 10 నుంచి 20 నిముషాల చొప్పున దశల వారీగా రోజు మొత్తం మీద ఐదారు గంటలకు పైగా అనధికారికంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని మండిపడుతున్నారు.
నందిగామ, అనాసాగరం, చందాపురం గ్రామాల్లోని విద్యుత్ సబ్ స్టేషన్‌ల ద్వారా పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలకు విద్యుత్ శాఖాధికారులు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అయితే ఈ సబ్ స్టేషన్‌ల పరిధిలో చిన్నపాటి వర్షం పడినా.. చిరు గాలులకు చెట్లు కదిలినా విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంతో ప్రజలు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ కోతలు లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే నందిగామలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. అధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని విద్యుత్ శాఖాధికారులు అనధికారిక కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఈఎల్‌ఆర్(ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్) పేరుతో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని వాపోతున్నారు.
మిగిలిన చోట్లా ఇదే పరిస్థితి..
జగ్గయ్యపేట నియోజకవర్గంలో కూడా అప్రకటిత కరెంట్ కోతలు కొనసాగుతున్నాయి. ఇక్కడ సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. దీంతో లైన్ ట్రిప్ అయినా.. లేక ఏదైనా సమస్య వచ్చినా దానిని పునరుద్ధరించడానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. ఇక కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, పెడన, పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో సైతం కోతలు అధికంగానే ఉన్నాయి.
విద్యుత్ సరఫరా నిలిచిన సమయంలో సమాచారం తెలుసుకునేందుకు ఫోన్ చేసినా కనీసం స్పందించటం లేదని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు లైన్‌మెన్‌లు మరొకడుగు ముందుకేసి ఈఎల్‌ఆర్(ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్) పేరుతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, విద్యుత్ సరఫరాకు సమయం పడుతుందని వాట్సాప్ స్టేటస్‌లు పెడుతున్నారు తప్ప విద్యుత్ సరఫరా సమాచారం మాత్రం చెప్పటం లేదని వినియోగదారులు వాపోతున్నారు. విద్యుత్ శాఖాధికారులు స్పందించి అనధికారిక విద్యుత్ కోతలు విధించకుండా నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


