కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): వైద్య విద్య ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ ఈ నెల 21న జరగనుంది. గత నెల మూడో తేదీన జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ కారణంగా ప్రభుత్వం దానిని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ పరీక్షను తాజాగా ఈ ఆదివారం దేశ వ్యాప్తంగా నిర్వహించేందుకు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 12 వేల మంది అభ్యర్థులకు 31 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పరీక్షను నిర్వహించాల్సి ఉండగా.. ప్రత్యేక కారణాల రీత్యా మరో 15 నిమిషాలు అధికంగా సమయాన్ని ఇవ్వనున్నారు. పరీక్ష సాయంత్రం 5.15 నిమిషాల వరకూ కొనసాగనుంది. పరీక్ష మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే అభ్యర్థులను ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల తరువాత అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు.
వస్త్రధారణపై ఆంక్షలు..
నీట్‌కు హాజరయ్యే అభ్యర్థులు వస్త్రధారణపై జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ గత అనుభవాల రీత్యా పలు ఆంక్షలు విధించింది. అభ్యర్థులు చెవులకు దిద్దులు, చేతులకు గాజులు, ముక్కుపుడకతో సహా ఆభరణాలు, వాచీలు, జీన్స్ ప్యాంట్లు, టోపీలు, సన్‌గ్లాసెస్ ధరించకూడదు. సెల్‌ఫోన్లు, స్మార్ట్‌బాండ్లు వంటి ఇతర ఎటువంటి వస్తువులను అనుమతించరు.
ట్రాఫిక్ అలర్ట్..
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న దృష్ట్యా నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు ట్రాఫిక్ ఇబ్బందులను గమనంలో ఉంచుకొని ముందుగానే బయలుదేరి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): నీట్ పరీక్ష నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు బందరులో ఏర్పాటు చేసిన రెండు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారన్నారు. ఎలాంటి సమస్య తలెత్తకుండా పర్యవేక్షణ కోసం ఈ నెల 20, 21వ తేదీల్లో కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి కంట్రోల్‌రూమ్(08672–252399)ను ఏర్పాటు చేశామన్నారు. 20వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 21వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంట్రోల్ రూమ్ పనిచేస్తుందన్నారు.
రేపటి పరీక్షకు ఎన్టీఆర్ జిల్లాలో
31 కేంద్రాలు


