పెనుగంచిప్రోలు: తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో 5 వేల ఆలయాలను నిర్మించనున్నామని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్‌లాల్ అన్నారు. గ్రామంలో వేంచేసి ఉన్న తిరుపతమ్మవారిని శుక్రవారం ఆయన కటుంబసభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ ఈఓ బి. మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఈఓ అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటంతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 27,500 ఆలయాలు ఉన్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకారులు నివసించే ప్రాంతంలో 5వేల ఆలయాలు రాబోవు మూడేళ్ల కాలంలో పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే 1,275 ఆలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామన్నారు.
త్వరలో అంతా ఆన్‌లైన్..
రాబోవు రోజుల్లో ఆలయాల్లో అన్ని రకాల సేవలను భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుకింగ్ చేసుకుంటారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో 40 శాతం ఆన్‌లైన్‌లో టికెట్లు బుకింగ్ చేసుకుంటుంటే అన్నవరంలో మాత్రం 95 శాతం అమలవుతుందన్నారు. రాష్ట్రంలో 22 ముఖ్య ఆలయాలు ఉంటే వీటిలో 7 ఆర్‌జెసీ, 15 డీసీ కేడర్‌లో ఉన్నాయన్నారు. ఆదాయపరంగా, భక్తుల పరంగా ముఖ్యమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 6(ఎ) ఆలయాలు 175 ఉన్నాయని, వీటిల్లో కూడా సిబ్బంది, భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు, దర్శనాలుపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. కేశ ఖండనశాల, ఆలయ పరిసరాల్లో భక్తులకు అందుతున్న సేవలను వారినే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆలయ ఏఈఓ జంగం శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.
దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
హరి జవహర్‌లాల్


