పటమట(విజయవాడతూర్పు): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర–2026 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం(ఐజీఎంసీఎస్)లో చేపట్టిన ఏర్పాట్లను మున్సిపల్ పరిపాలన, పట్టణాభివద్ధి శాఖ కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కార్యక్రమ వేదిక, యోగా సాధన ప్రదేశం, అతిథులు, యోగా సాధకులు, ప్రజల కోసం చేపట్టిన ఏర్పాట్లు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, జోనల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.


