ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనులకు విజయవాడకు చెందిన భక్తులు రూ.2 లక్షల విరాళం సమర్పించారు. విజయ వాడ భారతీనగర్‌కు చెందిన హెచ్.భాగ్యలక్ష్మి గురువారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి రూ.2 లక్షల విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు శ్రీనివాసరావు, సూపరిండెంటెంట్ నాగేశ్వరరావు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జపాన్‌లో ఇటీవల జరిగిన మహిళల అండర్–18 హాకీ ఆసియా కప్ పోటీల్లో భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి నమ్మి గీతశ్రీని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ ఎ.రవినాయుడు సత్కరించారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో ఉన్న శాప్ ప్రధాన కార్యాలయంలో రవినాయుడును గీతశ్రీ గురువారం కలిసి తాను ఇప్పటి వరకు సాధించిన విజయాల గురించి తెలిపింది. భవిష్యత్తులో జరగనున్న జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మరిన్ని విజయాలు సాధించి భారతదేశానికి పతకాలు అందించాలని గీతశ్రీకి రవినాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాప్యం లేకుండా 12వ పీఆర్సీ కమిషనర్‌ను నియమించాలని ఏపీ జేఏసీ, అమరావతి ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ బత్తిన రామకృష్ణ డిమాండ్ చేశారు. ఉద్యోగులకు హక్కుల సాధన కోసం ఉద్యమా నికి పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వివిధ జిల్లా కార్యాలయాల్లో ఉద్యోగులను కలిసి అవగాహన కల్పించారు. రామకృష్ణ మాట్లాడుతూ.. ఉద్యోగులకు ఐఆర్ విడుదల చేయాలని, వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని కోరారు. తిమ్మసర్తి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగులకు అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు డి.వెంకటేశ్వరరావు, ప్రసాద్, సోము శేఖర్, బంక్ శ్రీను, బాషా, సుబ్బారావు, గోపి, దీపక్ కుమార్, సులోమాన్ రాజు, శ్యాం తదితరులు పాల్గొన్నారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యుత్ వినియోగదారుల సమస్యలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి ఆదేశించారు. స్థానిక గుణదలలోని ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ జిల్లా విద్యుత్ అధికారులతో వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం గురువారం జరిగింది. పుల్లారెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాలో లైన్ లాసెస్ లేకుండా చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. రెవెన్యూ వసూలుపై దృష్టి పెట్టాలని సూచించారు. పీఎం సూర్యఘర్, పీఎం–కుసుమ, ఎల్‌టీ నెట్‌వర్క్ అభివృద్ధి అంశాలపై వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపీసీపీడీసీఎల్ ఎన్టీఆర్ జిల్లా సూపరింటెండింగ్ ఇంజినీర్ హనుమయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఆపరేషన్స్ విభాగం అధికారులు, ఏపీసీపీడీసీఎల్ (టెక్నికల్) డైరెక్టర్ ఎ.మురళీకృష్ణ యాదవ్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టి.వి.ఎస్.ఎన్.మూర్తి,ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


