మరో 13 సూచికల్లోనూ సత్వర అభివృద్ధికి చర్యలు మహిళా సాధికారతకుసరికొత్త వేదిక గుంటుపల్లి రైజ్ ఇబ్రహీంపట్నంలో పర్యటించిన కేంద్ర ప్రభారీ అధికారి అశోక్‌బాబు
ఇబ్రహీంపట్నం: ఆకాంక్షిత బ్లాకుల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమష్టిగా కృషి చేస్తున్నా మని కేంద్ర ప్రభారీ అధికారి నేలపట్ల అశోక్‌బాబు పేర్కొన్నారు. 38 సూచికలకు ఇప్పటికే 25 సూచికల్లో 100 శాతం పురోగతి సాధించామని తెలిపారు. మిగిలిన 13 సూచికల్లోనూ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషిచేస్తామన్నారు. నేషనల్ వాటర్ మిషన్ డైరెక్టర్, కేంద్ర ప్రభారీ అధికారి అశోక్‌బాబు గురువారం ఇబ్రహీం పట్నం మండలంలో అధికారులతో కలిసి పర్యటించారు. కొటికలపూడిలోని హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. మహిళా శిశు సంక్షేమానికి ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాల తీరును పరిశీలించారు. మూలపాడు లోని ఉపాధి హామీ పథకం అనుసంధానంతో చేపట్టిన మునగ, నిమ్మ ప్లాంటేషన్ ప్రాంతాలు, బటర్ ఫ్లై పార్కును సందర్శించారు. కొండపల్లిలో ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాలతో పాటు గుంటుపల్లిలో వ్యవసాయ క్షేత్రాలు, రైజ్ కేంద్రాన్ని సందర్శించి, మహిళలు స్వయం ఉపాధి దిశగా అమలు చేస్తున్న వినూత్న శిక్షణ కార్యక్రమాల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 500లకు పైగా ఆకాంక్షిత బ్లాకులను కేంద్ర ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో 15 బ్లాకులు ఉండగా, ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు మండలాలు ఉన్నా యన్నారు. మిగిలిన మండలాలతో సమానంగా ప్రగతి సాధించేలా ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. ఇంటింటికీ కుళాయి ద్వారా నీటి సరఫరా, గృహ నిర్మాణం వంటి వాటికి సంబంధించిన సూచికల్లోనూ సంతృప్తికర స్థితికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సారథ్యంలో బ్లాకు యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసి అన్ని సూచికల్లో ప్రగతి దిశగా తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు డి.శకుంతల, రామకృష్ణ నాయక్, డెప్యూటీ ఎంపీడీఓలు వి.మనోజ్, బి.ప్రసాద్, బ్లాక్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఎంఈఓ పుష్పలత, సీడీపీఓ పుష్పలత, డీఆర్‌డీఏ పీడీ నాచారరావు తదితరులు పాల్గొన్నారు.


