పుష్కరాల నేపథ్యంలో..
బాజాభజంత్రీలకు వేళాయె
పీపీపీ..
డుండుండుం
మంచి ముహూర్తాలు ఉన్నాయి..
● చాలా రోజుల విరామం తరువాత ప్రారంభమైన ముహూర్తాలు ● రానున్న నాలుగు మాసాల్లో వేలాది వివాహాలు ● జోరుగా క్యాటరింగ్, కల్యాణ మండపాల బుకింగ్ ● తర్వాత పుష్కరాలు ఉండటంతో త్వరపడుతున్న వైనం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వివాహ ముహూర్తాలు ప్రారంభం కావటంతో ఆయా కుటుంబాలు పెళ్లి పనులను ప్రారంభించాయి. అధిక జ్యేష్ట మాసం ముగిసి రెండు రోజుల క్రితమే నిజజ్యేష్ట మాసం ప్రారంభమైంది. దాంతో అన్ని ప్రాంతాల్లో శుభకార్యాలకు సంబంధించి హడావుడి ప్రారంభమైంది. ఆయా ఇళ్లల్లో సందడి వాతావరణం నెలకొంది. శుభకార్యాలపై ఆధారపడిన వర్గాల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది.
నెలవిడిచి నెల శుభముహూర్తాలు..
అధిక జ్యేష్టమాసంలో ముహూర్తాలు ఉండవు. నిజ జ్యేష్టమాసం ప్రారంభం కావటంతో ఈ నెల 16 నుంచి నెల రోజుల పాటు ముహూర్తాలు కొనసాగుతున్నాయి. నెల రోజుల పాటు వివాహాలకు, గృహప్రవేశాలకు ఇతర శుభకార్యక్రమాలకు అనువుగా ఉన్నట్లు పండితులు వివరిస్తున్నారు. అలాగే నెల తరువాత మళ్లీ శ్రావణమాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ప్రధానంగా శ్రావణమాసం అన్ని కార్యక్రమాలకు మంచి మాసంగా, ఏ శుభకార్యక్రమమైనా ఆ మాసంలో చేసుకోవటానికి అనువైన ముహూర్తాలు ఉంటాయని వారు వివరిస్తున్నారు. ఆ తరువాత మళ్లీ ఆశ్వీయజ మాసంలో మంచి ముహూర్తాలు ప్రారంభమవుతాయని ఆ మాసంలోనూ వివాహ ముహూర్తాలకు అవకాశమున్నట్లు వారు చెబుతున్నారు.
ఆషాఢం, భాద్రపదాలు శూన్యమాసాలు..
నిజ జ్యేష్టమాసం ముగిసిన తరువాత వచ్చే ఆషాఢంలో ముహూర్తాలు ఉండవు. జూలై 15 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకూ దాదాపుగా ఆ నెల రోజులు శుభకార్యక్రమాలకు బ్రేక్ పడుతుంది. ఆ తరువాత మళ్లీ భాద్రపద మాసంలోనూ శుభకార్యక్రమాలకు అవకాశముండదని పండితులు చెబుతున్నారు. అంటే సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకూ ఈ మాసం ఉంటుంది. ఆ మాసంలో ఎటువంటి ముహూర్తాలు ఉండవని వారు వివరిస్తున్నారు.
వివాహాల జోరు..
ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా రానున్న నాలుగు మాసాల్లో వేలాది వివాహాలు జరగనున్నట్లు పండితులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదారు వేల కల్యాణమండపాలు, హోటల్స్, కన్వెన్షన్ సెంటర్‌లు, కమ్యూనిటీ హాల్స్‌కు డిమాండ్ పెరిగింది. ఇంటి వద్ద వివాహాలు జరుపుకోవటానికి అవకాశమున్నప్పటికీ అధిక శాతం కుటుంబాలు కల్యాణమండపాలు, ఇతర వేదికల వద్దనే వివాహాలు జరుపుకోవటానికి ఆసక్తి చూపుతున్నాయి. ప్రధానంగా వాతావరణ పరిస్థితులు కావచ్చు, సోషల్ స్టేటస్ తదితర కారణాల రీత్య బయటే వివాహాలు జరుపుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు.
ఫుల్ డిమాండ్..
వివాహాల సీజన్‌పై చాలా విభాగాలు దానిపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా కల్యాణ మండపాలు పక్కన పెడితే ముఖ్యమైనది భోజనాలు దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాలో వేలాది మంది క్యాటరింగ్ నిర్వాహకులు ఈ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. దాంతో వివాహాలు సీజన్ ముఖ్యమైనది కావటంతో వారికి గిరాకీ పెరిగింది. వారితో పాటుగా వివాహాలు జరిపించే పండితులు, మండపాలను ఆకర్షణీయంగా అలంకరించే డెకరేటింగ్, బాజాభజంత్రీలు, ఆర్కెస్ట్రా కళాకారులు ఇలా అనేక మంది ఈ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈవెంట్ మేనేజర్‌లు సైతం ఈ సీజన్‌ను ఉపయోగించుకోవటానికి సిద్ధంగా ఉన్నారు.
రానున్న రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలో రెండు ముఖ్యనదుల పుష్కరాలు జరగనున్నాయి. ముఖ్యంగా గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి 12 రోజుల పాటు కొనసాగనున్నాయి. అలాగే కృష్ణానదికి సైతం 2028 ఆగస్టు మాసంలో ప్రారంభమవుతాయి. పుష్కరాలు జరిగే సంవత్సరాల్లో వివాహాలు చేయకూడదనే ఆచారాలు ఉన్నాయి. ఆ సంప్రదాయాలను చాలా కుటుంబాలు పాటిస్తాయి. కనుక వచ్చే రెండేళ్లలో రానున్న పుష్కరాల దృష్ట్యా చాలా కుటుంబాలు తమ ఇళ్లలో వివాహాలు ఈ ఏడాదిలో వచ్చే ముహూర్తాల్లోనే పూర్తి చేయాలని భావిస్తున్నాయి.
నిజజ్యేష్టం, శ్రావణం, ఆశ్వీయజ మాసాల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. అధిక జ్యేష్టం, ఆషాఢం, భాద్రపదాలు శూన్యమాసాలు కావటంతో ముహూర్తాలు ఉండవు. కాబట్టి ముహూర్తాలు ఉన్న మాసాల్లో అధిక సంఖ్యలో శుభకార్యాలు జరగటానికి అవకాశముంది. ఇప్పటికే చాలా మంది వివాహ ముహూర్తాలు నిర్ణయించుకొని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయా మాసాల్లో వారివారి జన్మనక్షత్రాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ముహూర్తాలు నిర్ణయం అవుతాయి. – పొన్నంగిపల్లి శ్రీరామచంద్రమూర్తి, పురోహితుడు


