అక్రమ తవ్వకాల అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

అక్రమ తవ్వకాల అడ్డగింత

Jun 18 2026 1:47 AM | Updated on Jun 18 2026 1:47 AM

● ప్రభుత్వ నిబంధనలు పాటించని కూటమి నాయకులు ● జేసీబీ, పొక్లెయిన్‌లతో తవ్వి లారీలతో పక్క రాష్టానికి తరలింపు ● ఇసుక దోపిడీపై సీఎం చంద్రబాబు, లోకేష్‌ సమాధానం చెప్పాలి ● అధికారులను నిలదీసిన జోగి రమేష్‌

దాములూరు(ఇబ్రహీంపట్నం): ఇబ్రహీంపట్నం మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఇసుక రేవులో కృష్ణానది గర్భం నుంచి తవ్వి అక్రమంగా ఇసుక తరలింపుపై ఆ మధ్య కాలంలో మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్‌ అధికారులు అడ్డుకట్ట వేశారు. నెలరోజులు తిరగకుండానే మళ్లీ అక్కడ తవ్వకాలు ప్రారంభించారు. కొత్తగా దాములూరు ఇసుక క్వారీ నుంచి యంత్రాలతో తవ్వి లారీలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ఇసుక మాఫియాను మాజీ మంత్రి జోగి రమేష్‌ బుధవారం సాయంత్రం పార్టీ నాయకులు, కార్యకర్తలతో వెళ్లి అడ్డుకున్నారు. వారిని చూసి లోడింగ్‌ అయిన లారీలు, లోడింగ్‌ చేస్తున్న పొక్లెయిన్‌ల డ్రైవర్లు పారిపోయారు. ఈ సందర్భంగా జోగి రమేష్‌ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో ప్రతి పనికి వాటా తీసుకుంటున్న పావలా ప్రసాద్‌(ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌), ఆయన బావమరిది అక్రమాలను సంబంధిత అధికారులు అడ్డుకోకపోతే ఏదో రోజు మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందన్నారు. దాములూరు శాండ్‌ సప్లయిర్స్‌ పేరుతో దొంగ బిల్లులు ప్రింట్‌ చేయించి ఇసుక దోపిడీకి తెగబడ్డారన్నారు. నదీ ప్రాంతంలో పొక్లెయిన్‌లు, జేసీబీలతో తవ్వకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఇసుక తవ్వకాలపై అధికారులు సమాధానం చెప్పాలన్నారు. నదికి అవతల వైపు ఉండే సీఎం చంద్రబాబు ఇవతల వైపు జరుగుతున్న దోపిడీపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌ను ఈ నియోజకవర్గం నుంచి పంపకపోతే ప్రకృతి వనరులు భవిష్యత్‌ తరాలకు మిగలవని మండిపడ్డారు. అధికారులు తక్షణం ఇసుక దోపిడీని అడ్డుకోవాలని డిమాండ్‌ చేస్తూ జోగి రమేష్‌ రాత్రి 7.40 గంటల వరకు రేవు వద్ద బైఠాయించారు. ఫోన్‌లో రెవెన్యూ, మైనింగ్‌ అధికారులను ప్రశ్నించగా వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ గరికపాటి శ్రీదేవి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండలానికి చెందిన నాయకులు మేడపాటి నాగిరెడ్డి, గుంజా శ్రీనివాస్‌, నల్లమోతు ప్రకాశ్‌, పచ్చిగోళ్ల పండు, రెంటపల్లి నాగరాజు, లంకే అంకమోహనరావు, పఠాన్‌నాగుల్‌మీరా, కుమ్మరి నాగరాజు, గోగులమూడి రాణి, శెట్టి ఈశ్వరి, సందిపాము రాజేష్‌, బాణావత్‌ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement