చల్లపల్లి: గత వారం రోజులుగా సొంత ఇంటి అరుగుల పైనే పరాయివారిలా కాలం నెట్టుకొస్తున్న మైక్రో ఫైనాన్స్ బాధిత కుటుంబం ఎట్టకేటకు బుధవారం ఇంట్లోకి వెళ్లారు. మైక్రోఫైనాన్స్ నిర్వాహకులు వచ్చి ఇంటికి వేసిన తాళాలు తీయటంతో అప్పటి వరకూ దీనంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ దళితవాడకు చెందిన కాకి సుకన్య ఇంటికి రేపల్లెకు చెందిన ఇన్ఫినిటీ మైక్రోఫైనాన్స్ నిర్వాహకులు లోను కిస్తీలు కట్టలేదని వారం రోజుల క్రితం ఇంటికి తాళం వేశారు. దీంతో కట్టుబట్టలతో వీధిన పడ్డ సుకన్య, ఆమె పిల్లలు మంగళవారం వరకూ ఆ ఇంటి బయట అరుగుల పైనే కాలం గడిపారు. చివరికి విషయాన్ని ‘సాక్షి’ దృష్టికి తీసుకురావటంతో ‘‘నలుగురు పిల్లలతో అరుగుపై నివాసం’’ అనే శీర్షికన బుధవారం సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి మాలమహానాడు సంఘ నేతలతో పాటు, రెవెన్యూ అధికారులు స్పందించారు. విషయం తెలిసిన వెంటనే మాల మహానాడు జిల్లా అద్యక్షుడు దోవా గోవర్దన్ పురిటిగడ్డలోని బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఇప్పటి వరకూ దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఇన్ఫినిటీ మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులకు ఫోన్ చేశారు. లోను కిస్తీ వ్యవహారాలు తరువాత చూసుకుందామని, వెంటనే వచ్చి వేసిన తాళాలు తీయకపోతే చట్టపరంగా ముందుకు వెళతామని హెచ్చరించారు. దీంతో ఇన్ఫినిటీ నిర్వాహకులు హుటాహుటిన వచ్చి ఇంటికి వేసిన తాళాలు తెరిచారు. అప్పటివరకూ ఇల్లు దక్కుతుందో... దక్కదోనన్న ఆందోళనతో ఉన్న సుకన్య, ఆమె నలుగురు పిల్లల మోములో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చి తమకు న్యాయం జరిగేలా కృషి చేసిన ‘సాక్షి’ పత్రికకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
వివరాలు సేకరించిన రెవెన్యూ అధికారులు
సాక్షిలో కథనం ప్రచురితం కావటంతో మచిలీపట్నం ఆర్డీవో సాంబశివరావు దీనిపై వివరాలు సేకరించి పంపాలని బుధవారం చల్లపల్లి ఇన్‌చార్జి తహసీల్దార్ టి.శ్రీలతను ఆదేశించారు. దీంతో తహసీల్దార్ శ్రీలత కాకి సుకన్యతో ఫోన్లో మాట్లాడి వివరాలు సేకరించారు.


