యోగా సాధనతో శారీరక, మానసిక ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

యోగా సాధనతో శారీరక, మానసిక ఆరోగ్యం

Jun 18 2026 1:47 AM | Updated on Jun 18 2026 1:47 AM

కలెక్టర్‌ లక్ష్మీశ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా నిర్వహిస్తున్న యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ సూచించారు. యోగాంధ్రలో భాగంగా బుధవారం విజయవాడ అర్బన్‌ పరిధిలోని బీఆర్టీఎస్‌ రోడ్డులో నిత్యయోగా కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది, రేషన్‌ డీలర్లు తదితరులతో కలిసి కలెక్టర్‌ లక్ష్మీశ యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధన అత్యంత అవసరమని అన్నారు. యోగా కేవలం ఒక వ్యాయామం మాత్రమే కాకుండా శరీరం, మనసు మధ్య సమతుల్యతను సాధించే సమగ్ర జీవన విధానం అన్నారు. నిత్య యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి జీవనశైలి సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలను తగ్గించి సానుకూల ఆలోచనలను పెంపొందిస్తుందన్నారు. విద్యార్థులకు యోగా జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతుందని, ఉద్యోగులకు పనితీరు మెరుగుపడేందుకు దోహదపడుతుందన్నారు. ప్రతిరోజూ కొంత సమయం యోగాకు కేటాయించడం ద్వారా ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి పి.వాణి, సహాయ పౌరసరఫరాల అధికారి వి.శ్రీనివాసులు నాయుడు, ఆయుష్‌ అధికారి డాక్టర్‌ వై.రత్నప్రియదర్శిని, డీఎస్‌డీవో కోటేశ్వరరావు, వీఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ డాక్టర్‌ డి.చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement