కంకిపాడు: చిన్న వివాదం ఘర్షణకు దారి తీసి ఓ వృద్ధుడి మృతికి కారణమైంది. మండలంలోని గోసాల సెంటరు (ఈడుపుగల్లు పరిధిలో) బుధవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఉప్పాల సాంబశివరావు (60) గోసాల సెంటరులో బడ్డీ కొట్టు నిర్వహిస్తున్నాడు. బడ్డీ కొట్టు వెనుక రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన మట్టిని నిల్వ చేశారు. సాంబశివరావు తమ్ముడి అల్లుడు బోలెం శ్రీను (35) బడ్డీ కొట్టు వెనుక ఉన్న మట్టిన తరలించేందుకు యత్నించాడు. విషయాన్ని గుర్తించిన సాంబశివరావు మట్టి తరలింపును అడ్డుకున్నాడు. దీంతో వారిద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. సాంబశివరావుపై బోలెం శ్రీను దాడి చేశాడు. దాడిలో గాయపడ్డ సాంబశివరావు ఆయాసంతో కూలబడిపోగా, అతని భార్య డాక్టర్ కోసం వెళ్లొచ్చేసరికి మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హత్య కేసుగా నమోదు చేసి ఇన్‌చార్జి సీఐ వెంకట నారాయణ దర్యాప్తు చేస్తున్నారు.
పిడుగుపాటుతో కౌలురైతు మృతి
Jun 18 2026 1:41 AM | Updated on Jun 18 2026 1:41 AM
పిడుగుపాటుతో కౌలురైతు మృతి గన్నవరం: పిడుగుపాటుతో కౌలురైతు మృతి చెందిన ఘటన ఉంగుటూరు మండలం గారపాడులో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఆగిరిపల్లి మండలం కృష్ణవరం గ్రామానికి చెందిన మాదల ప్రసాద్(35) గారపాడులో కౌలు వ్యవసాయంతో పాటు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం పాతూరి బాబూజీకి చెందిన పొలంలో మరి కొంత మంది కూలీలతో కలిసి విత్తనాలు వెదజల్లే పనికి ప్రసాద్ వెళ్లాడు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమై వారు పనిచేస్తున్న పొలం సమీపంలో పిడుగు పడింది. పిడుగు పడిన భారీ శబ్దానికి గట్టుపై కూర్చున్న ప్రసాద్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సహచర కూలీలు హుటాహుటిన అతడిని చిన్నఆవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రసాద్ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా ఉంగుటూరు ఎస్‌ఐ యు.గోవింద్ తెలిపారు.
క్షణికావేశంలో
వ్యక్తి ఆత్మహత్య కంకిపాడు: క్షణికావే శంలో ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కంకిపాడు పోలీసుస్టేషన్‌లో మంగళవారం రాత్రి కేసు నమోదైంది. ఎస్‌ఐ సందీప్ కథనం మేరకు.. పమిడిముక్కల మండలం హనుమంతపురం గ్రామానికి చెందిన కాగిత నాగరాజు (35) పది సంవత్సరాలుగా కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో భార్యాపిల్లలతో నివాసం ఉంటున్నాడు. నాగరాజు లారీ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 16న నాగరాజు మద్యం తాగి వచ్చి పిల్లలను కొట్టడంతో అతని సోదరి, భార్య పిల్లలను ఎందుకు కొట్టా వంటూ గట్టిగా నిలదీశారు. దీంతో మనస్తాపం చెందిన నాగరాజు క్షణికావేశంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ సందీప్ తెలిపారు.
టిప్పర్ ఢీకొని
యువకుడి దుర్మరణం రామవరప్పాడు: టిప్పర్ బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందిన ప్రమాదం విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో బుధవారం జరిగింది. గ్రామంలోని నెహ్రూనగర్ ప్రభుత్వ పాఠశాల సమీపంలో పాలకొండ విజయ్ (29) భార్య, ఇద్దరు కుమారైలతో నివసిస్తున్నాడు. గ్రామంలోని ఓ కార్పొరేట్ కళాశాలలో వంట మనిషిగా పని చేస్తున్నాడు. ఎప్పటి లాగా బుధవారం తెల్లవారుజామున రెండు గంటలకు విధులకు హాజరయ్యాడు. పని ముగించుకుని ఉదయం ఎనిమిది గంటల సమయంలో ద్విచక్రవాహనంపై టిఫిన్ తీసు కుని ఇంటికి బయలుదేరాడు. గ్రామంలోని వినాయక ఆలయం సమీపంలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో బైక్ సహా విజయ్ టిప్పర్ కిందకు వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంలో టిప్పర్ చక్రాలు విజయ్ మీదుగా వెళ్లడంతో శరీరభాగాలు ఛిద్రమై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సమాచారం అందుకున్న పటమట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తర లించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధుడి ప్రాణంతీసిన ఘర్షణ
Advertisement


