పేదల బియ్యం పక్కదారి | - | Sakshi
Sakshi News home page

పేదల బియ్యం పక్కదారి

Jun 17 2026 5:33 AM | Updated on Jun 17 2026 5:33 AM

పేదల బియ్యం పక్కదారి

బియ్యం దందాలో పచ్చ నేతలే కీలకం పట్టుబడినా నామమాత్రపు కేసులే పార్లమెంటు ముఖ్యనేత కనుసన్నల్లో సాగుతున్న దందా ప్రతినెల ఒకటో తేదీ నాడే రేషన్‌ దుకాణాల్లో బియ్యం ఖాళీ ప్రతి నియోజక వర్గం నుంచి 500 టన్నుల బియ్యం మాఫియా చేతిలోకి

రేషన్‌డాన్‌పై కేసులున్నా...

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్‌ జిల్లాలో రేషన్‌ మాఫియా రెచ్చిపోతోంది. జిల్లాలో రేషన్‌ బియ్యం మాఫియా వ్యవహారాన్ని సాక్షాత్తూ ఓ టీడీపీ ఎమ్మెల్యే బహిరంగంగానే విమర్శిస్తున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదు. జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల్లో రేషన్‌ బియ్యాన్ని ఏకీ కృతంగా ఒక వ్యక్తే సేకరించి, కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలించి కోట్లు దండుకుంటున్నారు. ఈ దందాలో సింహభాగం పార్లమెంటు ముఖ్యనేత కనుసన్నల్లోనే సాగుతోంది.

కిందిస్థాయి అధికారులతో లాలూచీ

రేషన్‌ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసే విధంగా జాయింట్‌ కలెక్టర్‌ కఠినంగా వ్యవహరిస్తుండటంతో కింది స్థాయిలో పోలీసులు, రెవెన్యూ అధికారులను మేనేజ్‌ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నిత్యం ఎక్కడో చోట రేషన్‌ బియ్యం పట్టుబడుతూనే ఉన్నాయి. అసలు రేషన్‌ మాఫియా సభ్యులను వదిలేసి నామమాత్రపు కేసులు పెట్టి చేతులు దులుపుకొంటున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీనే రేషన్‌ దుకాణాల్లో బియ్యం ఖాళీ అయిపోతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో సగటున 500 టన్నులకు పైగా రేషన్‌ బియ్యం మాఫియా చేతుల్లోకి పోతున్నాయి. రైస్‌ మిల్లుల్లో ఈ బియ్యాన్ని పాలిష్‌ చేసి, నేరుగా కాకినాడ పోర్టు మీదుగా విదేశాలకు తరలిస్తున్నారు. బియ్యం మాఫియా నుంచి ప్రతి నెలా పార్లమెంటు ముఖ్యనేతకు కోటి రూపాయలు, నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు రూ.25 లక్షల చొప్పున మామూళ్లు వెళుతుంటాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విజయవాడ సెంట్రల్‌లో...

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో గత వారంలో నున్న సమీపంలో పెద్ద ఎత్తున రేషన్‌ బియ్యాన్ని పట్టుకొన్నారు. అసలు దొంగలను వదిలేసి, అనామకులపై కేసులు పెట్టి చేతులు దులుపుకొన్నారు. దీంతో ఆ ముఠా అక్కడ నుంచి సూరం పల్లికి మకాం మార్చి అక్కడ గోడౌన్‌లు అద్దెకు తీసుకుని రేషన్‌ బియ్యం తరలించి, అక్కడ నుంచి హైవే మీదుగా బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు. ఇటీవల నిడమానూరు సమీపంలో పటమట పోలీసులు బియ్యం లారీని పట్టుకొన్నారు. ఈ మాఫియాలో ప్రధానంగా ఒకరేమో డీలర్ల సంఘంలో అపోసియేషన్‌ నాయకుడు, ఇంకొకరు రెండవ డివిజన్‌కు చెందిన టీడీపీ నేత, ఇంకొకరు బియ్యం మాఫియాలో ‘వైకుంఠ ’పాళిలా అంచెలంచలుగా ఎదిగిన వ్యక్తి. వీరి పేర్లు పోలీసుల హిట్‌లిస్టులో కూడా ఉన్నాయి . రెండేళ్లుగా ఈ గ్యాంగ్‌ యథేచ్ఛగా రేషన్‌ దందా చేస్తూ లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారు.

విజయవాడ వన్‌టౌన్‌లో...

వన్‌టౌన్‌, కొత్తపేట, చిట్టినగర్‌ పరిధిలోని రేషన్‌ డీలర్లు అందరూ సిండికేట్‌గా మారి అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిట్టినగర్‌కు చెందిన ఓ సీనియర్‌ రేషన్‌ డీలర్‌ ఈ అక్రమ దందాకు తెర లేపాడు. డిపో డీలర్ల వద్ద నుంచి అక్రమంగా బియ్యాన్ని కొనుగోలు చేసి ఓ మధ్యవర్తి సాయంతో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు. ఇందుకు పగటి వేళ అయితే అందరికీ తెలుస్తుందనే భావనతో రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున రెండు గంటల మధ్య బియ్యం అక్రమ రవాణాకు అనువుగా మార్చుకున్నారు. అయితే ఈ వ్యవహారమంతా పౌర సరఫరాల శాఖ అధికారులకు తెలిసే జరుగుతోందని రేషన్‌ డీలర్లు బహిరంగంగానే అంటున్నారు.

వీరులపాడులో 295 బస్తాల బియ్యం పట్టుకుని కేసులు నమోదు చేశారు. వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన కాజా సత్యనారాయణ(50)పై పీడీ యాక్టు అమలు చేశారు. ఇతనిపైన 41 కేసులు ఉన్నాయి. ప్రస్తుతం రేషన్‌ మాఫియాలో కీలకంగా వ్యవహరిస్తున్న రామచంద్రరావుపైన ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఇతనిపై పీడీ యాక్టు అమలు కాకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇతను పార్లమెంటు ముఖ్యనేత, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో పాటు, స్థానికంగా ఉండే పోలీసు, రెవెన్యూ అధికారులకు ముడుపులు ముట్టజెపుతుండటంతోనే ఇతన్ని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని విమర్శలున్నాయి. గత నెల 6 వ తేదీన కొండపల్లి శాంతినగర్‌లో 550 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 7వతేదీ తిరువూరు మండలం రాజుగూడెంలో 60 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement