నందివాడ: బుడమేరులో ఈతకు దిగి బాలుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన లక్ష్మీనరసింహాపురం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం. ఏలూ రు జిల్లా దుగ్గిరాల గ్రామానికి చెందిన తలారి మానస గోపాల్ (కిట్టు) (14), బన్నీ, డేవిడ్ మంగళవారం పోలుకొండ గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరై తిరిగి వచ్చే క్రమంలో లక్ష్మీనరసింహాపురం గ్రామంలో బుడమేరు వద్దకు వెళ్లారు. బన్నీ, డేవిడ్ కాలకృత్యాలు తీర్చుకోవడానికి కొద్ది దూరం వెళ్లారు. మానస గోపాల్ (కిట్టు) ఈత కొట్టేందుకు బుడమేరులో దిగగా ఆ ప్రవాహానికి కొట్టుకుపోతూ అన్నయ్యా.. అన్నయ్యా అంటూ పెద్దగా కేకలు వేశాడు. కిట్టు అరుపులు విన్న వాళ్లిద్దరూ అక్కడికి చేరుకుని వారి బంధువులకు ఆ ప్రమాదాన్ని తెలియజేశారు. సమాచారం అందుకున్న నందివాడ ఎస్‌ఐ పి.ఎస్.వి.సుబ్రహ్మణ్యం పోలీసు సిబ్బందితో కలిసి వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు రెండు గంటలపాటు ముమ్మరంగా సాగిన శోధన అనంతరం బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. కిట్టు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రెండేళ్ల కూటమి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వివక్ష, వంచన ద్రోహం చేసిందని ఏపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే ఆయా వర్గాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కుల కార్పొరేషన్లకు బదలాయించిందని ఆరోపించింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో రెండేళ్ల కూటమి పాలనపై మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. జేఏసీ కో–ఆర్డినేటర్ కొరివి వినయ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం అట్టడుగు వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించకుండా, బడ్జెట్ కేటాయించకుండా ఆర్థిక అణచివేతకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 27 సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని, ఎన్నికల్లో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం వాటి అమలు గురించి ఈ రెండేళ్లలో కనీస ప్రయత్నం కూడా చేయలేదన్నారు. తక్షణమే పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని కాల పరిమితికి సంబంధం లేకుండా ఆ వర్గాల సమగ్రాభివృద్ధి నిధి చట్టంగా మార్పుచేసి సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రూ.8 లక్షల ఆదాయ పరిమితితో ఎస్సీ, ఎస్టీ, బీసీల స్కాలర్‌షిప్‌లు గతంలో లాగా కొనసాగించాలని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విదేశీ విద్యోన్నతి పేరుతో బడ్జెట్ కేటాయించి అర్హులందరికీ అవకాశాలు కల్పించాలన్నారు. బ్యాక్ లాగ్స్ భర్తీ చేయాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఉప్పులేటి దేవీ ప్రసాద్, సీపీఐ నాయకుడు కరవాది సుబ్బారావు, డీహెచ్‌పీఎస్ నాయకులు నీలం నాగేంద్రరావు, తోటి చంగల్రావ్, నతం హరిబాబు, సాంబశివరావు, మేళం భాగ్యారావు, అంగడాల పూర్ణచంద్ర, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.


