గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధి, సమగ్ర ఆవిష్కరణలు, జీవనోపాధి అభివృద్ధికి దళిత్ ఫిలాంత్రఫీ ఫౌండేషన్(డీపీఎఫ్), రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ సమక్షంలో డీపీఎఫ్, ఆర్‌టీఐహెచ్ ప్రతినిధులు ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, సమగ్ర ఆవిష్కరణలు, జీవనోపాధి అభివృద్ధి, సామాజిక సంస్థల బలోపేతం కోసం సంయుక్తంగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. రెండు సంస్థలు కలిసి మహిళలు, యువత, వెనుకబడిన వర్గాల ఆర్థిక సాధికారతకు, స్వయం ఉపాధి అవకాశాల పెంపునకు, నైపుణ్యాభివృద్ధికి, వ్యాపారాల ప్రోత్సాహానికి కలిసి పనిచేస్తాయి. కార్యక్రమంలో డీపీఎఫ్ ఈడీ సంతోష్‌కుమార్ సామల్, హబ్ సీఈఓ జి.కృష్ణన్ పాల్గొన్నారు.
గంటలోనే తల్లిదండ్రుల చెంతకు
చేర్చిన పోలీసులు
అవనిగడ్డ: స్థానిక రెండవ వార్డుకు చెందిన మూడేళ్ల బాలుడు అంగన్‌వాడీ కేంద్రంకు వెళ్లి తప్పిపోగా గంటలోనే పోలీసులు తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఘటన మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అవనిగడ్డ రెండో వార్డుకు చెందిన గాయం బాలరాజు కుమారుడు అభి అంగన్‌వాడీ కేంద్రంకు వెళ్లాడు. అక్కడ నుంచి ఆడుతూ తప్పిపోయి వంతెన సెంటర్ వరకూ వెళ్లాడు. అక్కడ వచ్చీపోయే వాహనాలకు అడ్డుపడుతున్న అభిని ఏఎస్‌ఐ శ్రీనివాసరావు దగ్గరకు తీసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. వివరాలు అడిగినా చెప్పలేకపోవడంతో బాలుడిని తీసుకుని పలువురికి చూపిస్తూ వాకబు చేశారు. ఇంతలో ఒకతను అతనిని గుర్తించి మా వాళ్ళ కుర్రాడేనని వివరాలు చెప్పారు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులను పిలిపించిన ఏఎస్‌ఐ వారికి అప్పగించి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


