వైఎస్సార్‌ సీపీ అభిమాని ఇంటర్నెట్‌ ఆఫీసుపై దాడి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ అభిమాని ఇంటర్నెట్‌ ఆఫీసుపై దాడి

Jun 17 2026 5:33 AM | Updated on Jun 17 2026 5:33 AM

ఎమ్మెల్యే బొండా ఉమా అనుచరులుగా అనుమానం?

ఇంటికి వెళ్లి ఆఫీసు ఖాళీ చేయాలని హెచ్చరికలు

కేబుల్స్‌ పీకేసిన టీడీపీ గూండాలు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: వైఎస్సార్‌ సీపీ అభిమానులపై టీడీపీ గూండాల దాడులు పెచ్చుమీరుతున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ వాంబే కాలనీలో నివసించే వైఎస్సార్‌ సీపీ అభిమాని సింగంశెట్టి ప్రవీణ్‌ ఇంటర్నెట్‌ కార్యాలయం నిర్వహిస్తూ, వి డిజిటల్‌ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రవీణ్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ కోసం పని చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రవీణ్‌పై స్థానిక ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి గాయపరిచారు. అప్పట్లో నున్న పోలీసు స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్‌ చేయలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరులు ఎనిమిది మంది మంగళవారం ప్రవీణ్‌ ఇంటికి వెళ్లి వాంబే కాలనీలో ఇంటర్నెట్‌ కార్యాలయం ఉండకూడదని, ఖాళీ చేసి వెళ్లి పోవాలని హెచ్చరించారు. అనంతరం వాంబే కాలనీ ఏ బ్లాక్‌ 494 ఫ్లాట్‌లో ఉన్న ఇంటర్నెట్‌ కార్యాలయానికి వెళ్లి కేబుల్‌ కనెక్షన్లకు సంబంధించిన నెట్‌ వర్క్‌ను ఇష్టం వచ్చినట్లు పీకేసి, వైర్లు కట్‌ చేసి రూ.లక్షల విలువైన సామగ్రిని నాశనం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి కలవాలని హెచ్చరించారు. వన్‌టౌన్‌ వెళ్లాలని బెదిరింపులు, వేధింపులు చేస్తుండటంతో ప్రవీణ్‌ నున్న పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా స్థానిక ఎస్‌ఐ సాయి ఘటనాస్థలానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. తాను ఇంటర్నెట్‌ కార్యాలయం కోసం దాదాపు రూ.20 లక్షలు ఖర్చు చేసి ఎక్విప్‌మెంట్‌ను ఏర్పాటు చేసి కనెక్షన్లు ఇచ్చానని, స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించి కేబుల్‌నెట్‌ వర్కు ఉండటంతో దానికి పోటీగా ఉండకూడదనే ఆయన అనుచరులు దాడులు చేయడం, బెదిరింపులు చేస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement