● గంజాయి విక్రయించే 44 ముఠాల్లో 35 ముఠాలు అరెస్టు ● వెస్ట్‌జోన్ డీసీపీ రామకృష్ణ వెల్లడి
పాయకాపురం(విజయవాడరూరల్): విజయవాడ నగరాన్ని డ్రగ్స్ రహిత నగరంగా మార్పు తీసుకొచ్చేందుకు పోలీసు యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టిందని విజయవాడ నగర డెప్యూటీ పోలీసు కమిషనర్(వెస్ట్ జోన్) గుణ్ణం రామ కృష్ణ తెలియజేశారు. నున్న పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ నగరానికి వచ్చే వాహనాల్లో గంజాయి, ఇతర మత్తు పదార్ధాల రవాణాపై నిఘా పెట్టి తనిఖీలు చేస్తున్నామన్నారు. తమిళనాడు రాష్ట్రం మధురైకి చెందిన ఐదుగురు వ్యక్తులు హరి విఘ్నేష్ తానపాల్, షణ్ముఖ, సికిందర్, సూర్య, హరీష్ 26 కిలోల గంజాయిని విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో కొనుగోలు చేసి కారులో వెస్ట్ బైపాస్‌లో వస్తుండగా సోమవారం నున్న గ్రామ సమీపంలోని హలో గురు హోటల్ వద్ద వీరి కారు ఆగివున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు 108కి సమాచారం అందించి ప్రభుత్వాసుపత్రిలో చికిత్సకు పంపారు. ఈ సమాచారం తెలుసుకుని మహిళా ఎస్‌ఐ విమల ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలిస్తుండగా ఇద్దరు వ్యక్తులు ప్రాథమిక చికిత్స తీసుకొని వచ్చి కారు డిక్కీలో ప్రత్యేకంగా ప్యాక్ చేసి ఉన్న గంజాయిని పట్టుకుని పారిపోవడానికి యత్నించారు. ఎస్‌ఐ విమల వారిని సమయస్ఫూర్తితో పట్టుకుని స్టేషన్‌కు తీసుకొచ్చారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సూర్య చికిత్స పొందుతూ మృతి చెందాడు. అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను రైల్వే కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. మిగిలిన ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నార్త్ డివిజన్ పరిధిలో గంజాయి తాగే 1544 మందిని గుర్తించామని, వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మత్తు పదార్ధాలకు దూరంగా ఉండేందుకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. గంజాయిని విక్ర యించే 44 ముఠాల్లో 35 ముఠాలను అరెస్ట్ చేశామని డీసీపీ రామకృష్ణ చెప్పారు. విలేకరుల సమావేశంలో నార్త్ ఏసీపీ పి.సత్యానందం, నున్న సీఐ అహ్మద్ అలీ, ఎస్‌ఐ విమల పాల్గొన్నారు.


