అదనపు వసూళ్ల ఆరోపణలు..
ప్రైవేటు చేతుల్లోని
ఏటీఎస్‌లలో
ఐదు నెలల్లో 277 రహదారి ప్రమాదాలు.. 121మంది మృతి
ఆందోళన కలిగిస్తున్న ప్రమాదాలు..
మానవ ప్రమేయం లేదంటూనే వసూళ్ల పర్వం
● పైసలిస్తేనే ఫిట్ అంటున్నారని ఆరోపణలు
● రోడ్డెక్కుతున్న అన్‌ఫిట్ వాహనాలు
ప్రత్యక్ష అధికారాలు లేవు..
మచిలీపట్నంఅర్బన్: రవాణా రంగంలో వాహనాల ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియలో పారదర్శకత, నాణ్యత పెరుగుతాయని చెబుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లను (ఏటీఎస్‌లు) ప్రవేశపెట్టింది. చివరకు మొత్తం వ్యవస్థను ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి అప్పగించింది. ప్రజల ప్రాణాలకు సంబంధించిన వాహనాల భద్రత అంశాన్ని రవాణాశాఖ ప్రత్యక్ష పర్యవేక్షణ నుంచి దూరం చేసి, ప్రైవేట్ యాజమాన్యాలపై ఆధారపడే పరిస్థితిని తీసుకొచ్చింది. ఫిట్‌నెస్ పరీక్షల పేరుతో అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు దోచి పెట్టేందుకు మార్గం సుగమం చేసింది. ఫలితంగా మానవ ప్రమేయంలేని ఏటీఎస్‌లలో అవినీతి రాజ్యమేలుతోంది. పైసలిస్తేనే ‘ఫిట్’ అనే పరిస్థితి వచ్చింది. దీంతో ఫిట్‌నెస్ లేని వాహనాలు సైతం రోడ్డెక్కి అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
నిబంధనల అమలు ప్రశ్నార్థకం..
జిల్లాలో వాణిజ్య, ప్రజా రవాణా వాహనాలకు ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే ప్రక్రియలో అనేక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. వాహనాలను అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించి, పూర్తిగా ఫిట్‌గా ఉన్నప్పుడే పత్రాలు జారీ చేయాల్సి ఉండగా, జిల్లా కేంద్రం మచిలీపట్నానికి సమీపంలోని మల్లవోలులో ఏర్పాటు చేసిన ఏటీఎస్‌లో నిబంధనల అమలు ప్రశ్నార్థకంగా మారిందని వాహన యజమానులు చెబుతున్నారు.
ఎంవీఐల పాత్ర ఇలా..
గతంలో రవాణాశాఖ కార్యాలయాల్లో మోటారు వాహన ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐలు) ప్రత్యక్షంగా వాహనాలను తనిఖీ చేసి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేసేవారు. ప్రస్తుతం ఆటోమేటిక్ టెస్టింగ్ వ్యవస్థ పేరుతో ఎంవీఐల పాత్రను దాదాపు పూర్తిగా తొలగించడంతో పరీక్షల ప్రక్రియ మొత్తం ప్రైవేట్ నిర్వాహకుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో బాధ్యత, జవాబుదారీతనం రెండూ లేకుండా పోయాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజలపై భారమే..
ప్రతి జిల్లాకు ఒక్కటే ఏటీసీ ఏర్పాటు చేయడంతో వాహన యజమానులపై అనవసరమైన ప్రయాణ భారం పడుతోందన్న వాదన ఉంది. జిల్లా కేంద్రం మచిలీపట్నానికి సుమారు 10కిలోమీటర్ల దూరంలో ఏటీసీ ఉండటంతో, జిల్లా నలుమూలల నుంచి వాహనాలు ఫిట్‌నెస్ కోసం రావాలంటే కనీసం 60 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరో వైపు పక్క రాష్ట్రం తెలంగాణలో ఏటీసీలను ప్రభుత్వమే నిర్వహిస్తుండగా, ఇక్కడ మాత్రం ప్రైవేటీకరణ చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ప్రైవేట్ సంస్థలకు దోచిపెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ మంత్రం జపిస్తోందని ప్రజలు అంటున్నారు.
ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల (ఏటీఎస్)లో అధికారిక ఫీజులకు అదనంగా రూ.వెయ్యి నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏటీఎస్ నిర్వహిస్తున్న సంస్థ యాజమాన్యమే ఈ అదనపు వసూళ్లకు పాల్పడుతోందని వాహన యజమానులు ఆరోపిస్తున్నారు. ఫిట్‌నెస్ పరీక్ష కోసం ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకుని టెస్టింగ్ సెంటర్‌కు చేరుకున్న వాహనాల్లో లోపాలను గుర్తించి, వాటిని సరిచేయాలంటే అదనపు మొత్తం చెల్లించాలని సంస్థ సిబ్బంది డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అదనపు మొత్తాలు చెల్లించిన వాహనాలకు లోపాలు ఉన్నప్పటికీ ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారని, ఆశించినంత మొత్తం చెల్లించని వాహన యజమానులను మళ్లీ పరీక్షలకు రావాలని సూచిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రెండోసారి పరీక్షలకు హాజరుకావాలంటే అదనపు ప్రయాణ భారం, ఖర్చులు భరించాల్సి రావడంతో చాలామంది వాహన యజమానులు అడిగిన మొత్తాన్ని చెల్లించి ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నట్లు పేర్కొంటున్నారు.
వాహన ఫిట్‌నెస్ వ్యవస్థపై విమర్శలు
రాజ్యమేలుతున్న అవినీతి
జిల్లాలో రహదారి ప్రమాదాలు ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, జీపులు, ట్యాక్సీలు, వ్యాన్ల వల్లే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలోని జాతీయ రహదారులపై అత్యధికంగా 138ప్రమాదాలు నమోదై 64 మంది మృతి చెందగా, 167మంది గాయపడ్డారు. ఇతర రహదారులపై 90 ప్రమాదాలు, రాష్ట్ర రహదారులపై 49 ప్రమాదాలు నమోదయ్యాయి.


