విజయవాడ కల్చరల్: నగరానికి చెందిన కూచిపూడి నాట్యాచార్యుడు శ్రీనివాస్ అజయ్ చక్రవర్తికి 2024 సంవత్సరానికి గానూ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారం లభించినట్లు శ్రీనివాస చక్రవర్తి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సుదీర్ఘకాలం కూచిపూడి సంప్రదాయ నృత్యాన్ని దేశ విదేశాలలో ప్రదర్శించి వందలాది మందికి శిక్షణ ఇచ్చినందుకుగానూ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకమైన అవార్డ్‌కు ఎంపిక చేసింది. తల్లిదండ్రుల పెదప్రోలు జేజిబాబు, తల్లి శారద ప్రోత్సాహంతో ప్రముఖ నాట్యాచారిణి లంకా అన్నపూర్ణ నృత్యంలో ఓనమాలు నేర్చుకోగా.. కూచిపూడి నాట్యాన్ని నాట్యాచార్యులు వెంపటి చినసత్యం, వేదాంతం రాధేశ్యాం, వేదాంతం వెంకటా చలపతి వద్ద నేర్చుకున్నారు. అజయ్ చక్రవర్తి నృత్యరూపకాలలో ప్రతినాయక పాత్రలు, మహిషాసురుడు, రావణ బ్రహ్మ, ఘటోత్కచుడు, హిరణ్య కశ్యపుడు తదితర పాత్రాలలో నటించి రక్తికట్టించారు.
మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్టీయూ నాయకులు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని కోరారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా పరిషత్ పీఎఫ్ ఖాతాలను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడంతో పాటు పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ పియర్ స్లిప్‌లను విడుదల చేయాలని కోరారు. మచిలీపట్నం, గుడివాడ స్థానిక సంస్థల పరిధిలో పనిచేస్తున్న, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు సీఎస్‌ఎస్ పథకంలో జమ చేసిన డీఏ, వేతన సవరణ బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల మంజూరులో జరుగుతున్న జాప్యాన్ని నివారించి త్వరితగతిన పరిష్కరించాలని కోరా రు. ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి డి. చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడు పి. ఇమ్మానియేల్, జిల్లా ప్రధాన కార్యదర్శి యూవీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


