నలుగురు పిల్లలతో అరుగుపై నివాసం | - | Sakshi
Sakshi News home page

నలుగురు పిల్లలతో అరుగుపై నివాసం

Jun 17 2026 5:27 AM | Updated on Jun 17 2026 5:27 AM

భర్తను కోల్పోయిన బీదరాలిపై ‘ఇన్ఫినిటీ’ దాష్టీకం కిస్తీలు కట్టలేదని ఇంటికి తాళం

చల్లపల్లి: ఓవైపు భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖం.. నలుగురు పిల్లల్ని ఎలా సాకాలో తెలియక దిక్కు తోచని స్థితి.. ఈ లోపే ఓ మైక్రో ఫైనాన్స్‌ సంస్థ అమానుషత్వ ధోరణి ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. తీసుకున్న అప్పు కట్టలేదనే నెపంతో మానవత్వాన్ని మరచిపోయి ఆ నిరుపేద ఇంటికి తాళాలు వేశారు. అప్పు కడితేనే తాళాలు ఇస్తామని హుకుం జారీచేయటంతో ఆమె తన నలుగురు చిన్నపిల్లలతో సొంత ఇంటి ఆవరణలోనే కాలం నెట్టుకొస్తున్నారు.

ఏం జరిగిందంటే..

కృష్ణాజిల్లా, చల్లపల్లి మండలం పురిటిగడ్డ గ్రామానికి చెందిన కాకి మహేష్‌ అతని భార్య సుకన్య 2024 ఫిబ్రవరిలో రేపల్లెకు చెందిన ఇన్ఫినిటీ మైక్రో ఫైనాన్స్‌ సంస్థ నుంచి ఇంటి నిర్మాణం నిమిత్తం రూ.3లక్షలు అప్పు తీసుకున్నారు. అప్పట్లో తొలుత రెండు లక్షలు మాత్రమే ఇచ్చి మరో లక్ష తరువాత ఇస్తామన్నారు. అప్పు తీసుకున్న కొంత కాలానికి మహేష్‌ అనారోగ్యానికి గురై మృతిచెందారు. సంపాదించే భర్తను కోల్పోవటంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. లోను తాలూకా సంస్థ నుంచి రావాల్సిన మరో లక్ష ఇవ్వమని కోరింది. అయితే ఇంటి పనులు పూర్తయ్యాక ఆ లక్ష ఇస్తామని అప్పటి వరకూ వాయిదా సొమ్ము కట్టాల్సిందేనని అన్నారు. 2025 వరకూ నానా కష్టాలు పడి లోను కిస్తీలు కట్టుకుంటూ వచ్చింది. కూలీ పనులు చేయగా వచ్చే కొద్దిపాటి మొత్తంతోనే ఓ పక్క తన ముగ్గురు ఆడపిల్లలు, ఒక బాబు మొత్తం నలుగురు పిల్లల చదువు, ఇంటి ఖర్చులు క్రమంగా భారంగా మారటంతో తీసుకున్న లోన్‌కు సంబంధించిన వాయిదాలను సకాలంలో చెల్లించలేకపోయింది. రోజువారీ పనులు కూడా సరిగా దొరక్కపోవటంతో అసలు ఇల్లు కూడా గడవని పరిస్థితి. కొంతకాలం తర్వాత రూపాయి రూపాయి కూడబెట్టి లోను కడతానని బతిమాలినా మైక్రో ఫైనాన్స్‌ నిర్వాహకులు ఏమాత్రం కనికరించలేదు. వారం రోజుల క్రితం వచ్చి ఇంటికి తాళాలు వేశారు. తనకు ఇల్లు తప్ప మరో నీడలేదని ఆడపిల్లలతో ఎక్కడికి వెళ్లాలని.. మైక్కో ఫైనాన్స్‌ నిర్వాహకులను బతిమలాడింది. అయినా వారు కనికరించకుండా వెళ్లిపోయారు. చేసేది లేక ఎక్కడికి వెళ్లాలో తెలియక సొంత ఇంటి వసారాలోనే పరాయి వారిలా తన నలుగురు పిల్లలో కాలం గడుపుతోంది. నలుగురు పిల్లలు పురిటిగడ్డ హైస్కూల్లో చదవుతున్నారు. స్కూలుకు వెళ్లాలన్నా పుస్తకాలు లేవు. కట్టుకోవటానికి బట్టలు కూడా లేవు. అన్ని ఇంట్లోనే ఉండిపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement