ఐతవరంలో ప్రక్రియను పరిశీలించిన
కలెక్టర్ లక్ష్మీశ
నందిగామ రూరల్: అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించటంతో పాటు తప్పులు లేకుండా పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించటమే లక్ష్యంగా చేపట్టిన ‘సర్’ ప్రక్రియ జిల్లాలో సజావుగా సాగుతోందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. మండలంలోని ఐతవరం గ్రామంలో ఇంటింటి సందర్శన ద్వారా నిర్వహిస్తున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియ అత్యంత కీలకమైనదని ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వర్తించాలన్నారు.
జిల్లాలో 1,792మంది బీఎల్‌వోలు..
జిల్లాలో 1,792మంది బీఎల్‌వోలు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం బీఎల్‌వోలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. అర్హులు ఓటరు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లున్న వారిని తొలగించి స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఓటరు జాబితా సిద్ధం చేయాలని చెప్పారు. ఆర్డీవో అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి వివిధ సేవా టికెట్ల ద్వారా రూ.7,37,306 ఆదాయం వచ్చిందని ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదావు మంగళవారం వెల్లడించారు. అలాగే మోపిదేవి టీటీడీ కల్యాణ మండపంలో అంతర్జాతీయ యోగా ఉత్సవాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. ఈనెల 21వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 7.30 నుంచి 8.30గంటల వరకు ఉంటుందని వివరించారు.


